హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉన్న గంగపుత్ర , బెస్త, గూండ్ల కులస్తులకు న్యాయం చేస్తామని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హామీ ఇచ్చారు. తమ దృష్టికి తెచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఏపీకి చెందిన అగ్నికుల క్షత్రియ ఉపకులాల జాబితాలో గంగపుత్ర, బెస్తలను చూపించడం సమంజసం కాదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు.
ఆయన నాయకత్వంలో బెస్త, గంగపుత్ర, గూండ్ల సంఘాల ప్రతినిధులు హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ లో గల బీసీ కమిషన్ ఆఫీసులో గురువారం చైర్మన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న గంగపుత్రులు, బెస్తలు, గూండ్ల జనాభాను కులగణనలో తక్కువ చూపించడం బాధాకరమన్నారు. చేపల వృత్తి సంప్రదాయంగా వస్తున్న గంగపుత్ర, బెస్త, గూండ్ల సింబల్‌ను ఖడ్గం, తల్వార్ గా గుర్తించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

