- నాగర్ కర్నూల్ కలెక్టర్, ఎండోమెంట్ కమిషనర్‌కు బీసీ కమిషన్ ఆదేశాలు
- నిందితులను వెంటనే అరెస్ట్ చేయండి: డీజీపీకి బీసీ సంఘాల విజ్ఞప్తి
హైదరాబాద్/ముషీరాబాద్, వెలుగు: నాగర్ కర్నూ ల్ జిల్లా కుమ్మెర శివాలయంలో అగ్రకుల ఘాతుకానికి 2 నెలల చిన్నారి బలైన ఘటనపై బీసీ కమిషన్ స్పందించింది. ఈ ఘటనపై మూడు రోజుల్లో సమ గ్ర నివేదిక ఇవ్వాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్‌ను, ఎండోమెంట్ కమిషనర్ హరీశ్‌ను బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సోమవారం ఆదేశిం చారు. అలాగే, మంగళవారం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, మెంబర్లు బాలలక్ష్మి, జయప్రకాశ్, సురేం దర్ కుమ్మెర గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని కలిసి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.
నిందితులను కఠినంగా శిక్షించండి: డీజీపీకి విజ్ఞప్తి
దళిత, బీసీ కుటుంబానికి చెందిన భార్యాభర్తలపై అమానుషంగా దాడి చేసి, పసికందు మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ సంఘాల నేతలు డీజీపీకి విజ్ఞప్తి చేశారు. నిందితులపై హత్య కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్చేయాలన్నారు. బాధిత కుటుంబమైన గణేశ్, మౌనికకు ప్రభుత్వం నుంచి రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలన్నారు. సోమవారం డీజీపీ శివధర్ రెడ్డిని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, గుజ్జ కృష్ణ, శ్రీనివాస్ ముదిరాజ్ తో పాటు పలువురు బీసీ నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ ఘటన అత్యంత దారుణమన్నారు. ఇలాంటి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా నిందితులను తక్షణమే అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబమైన గణేశ్, మౌనిక దంపతులకు న్యాయం జరిగే వరకు రాష్ట్రవ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పోరాడుతామని హెచ్చరించారు. బాధి తులకు న్యాయం చేస్తామని డీజీపీ తమకు హామీ ఇచ్చినట్లు జాజుల తెలిపారు.
బీసీల రక్షణ చట్టం తేవాలి: ఆర్. కృష్ణయ్య
కుమ్మెరలో చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బీసీ సంఘాల జేఏసీ చైర్మ న్, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. దైవద ర్శనానికి వచ్చిన వారిపై అగ్రకులానికి చెందిన వారు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. బాధితుల పక్షాన నిలబడాల్సిన పోలీసులు.. వారిపై నే కేసులు పెట్టడం అన్యాయం అని మండిపడ్డారు. హైదరాబాద్ విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో సోమ వారం జరిగిన 14 బీసీ సంఘాల సమావేశానికి ఆర్.కృష్ణయ్యతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీ య వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు ఉన్నట్లుగానే బీసీల రక్షణకు కూడా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. చిన్నారి మృతికి కారణమైన వారిని శిక్షించే వరకు పోరాటం కొనసాగుతుందని, ఇందులో భాగంగా ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
