ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయండి : బీసీ సంక్షేమ సంఘం నేతలు

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయండి : బీసీ సంక్షేమ సంఘం నేతలు
  •     సీఎస్ కు బీసీ సంఘాల విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోపు ఫీజు రీయింబర్స్ మెంట్  బకాయిలు రిలీజ్  చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేతలు కోరారు. గురువారం ఈ అంశంపై సెక్రటేరియెట్ లో సీఎస్ రామకృష్ణారావును బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్ గౌడ్, గుజ్జ కృష్ణ, శ్రీనివాస్ ముదిరాజ్, విక్రమ్ గౌడ్ తో పాటు పలువురు నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. బకాయిలతో 22 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఎస్ కు నేతలు తెలిపారు. 

అధికారంలోకి రాగానే ఫీజు రీయింబర్స్ మెంట్  విడుదలతో పాటు ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లిస్తామని కాంగ్రెస్  పార్టీ మాట ఇచ్చిందని నేతలు గుర్తుచేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందన్న భరోసాతో లక్షల మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగిస్తున్నారని తెలిపారు. బకాయిలు రాక కొందరు ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు. ఫీజు రీయింబర్స్ మెంట్  విషయంలో ఉద్యమాన్ని ఆపేది లేదని, త్వరలోనే గవర్నర్, మంత్రులు, డిప్యూటీ సీఎం, సీఎంలను కలిసి విన్నవిస్తామని నేతలు వెల్లడించారు.