హైదరాబాద్, వెలుగు: ఇండియా యూత్ –2026 నేషనల్ సెయిలింగ్ పోటీల్లో బీసీ గురుకుల సొసైటీ విద్యార్థిని ఝాన్సీ గోల్డ్ మెడల్ సాధించగా, అరవింద్ వెండి పతకం సాధించాడు. ఎంజేపీ విద్యాసంస్థల్లో చదువుతున్న ఏడుగురు విద్యార్థులు జాతీయ స్థాయి సెయిలింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చారు.
వీరిలో నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎంజేపీ పాఠశాలకు చెందిన పి.ఝాన్సీ గ్రీన్ ఫ్లీట్ సింగిల్స్ విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. నిజామాబాద్ జిల్లా ధర్మారం మండలం ఇందూర్ ఎంజేపీ పాఠశాలకు చెందిన ఎ.అరవింద్ డబుల్స్ విభాగంలో రజత పతకం గెలిచాడు. యాచింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ముంబై సమీపంలోని మార్వేలో ఈనెల 2 నుంచి 8 వరకు పోటీలు జరిగాయి. బీసీ గురుకుల విద్యార్థులు చదువులతోపాటు క్రీడల్లోనూ రాణించడం గర్వంగా ఉందని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ గురుకుల సెక్రటరీ సైదులు పేర్కొన్నారు.
