పంచాయతీలో బీసీలకు అన్యాయం : చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్

పంచాయతీలో బీసీలకు అన్యాయం : చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్
  • బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఫైర్
  • జీవో కాపీలు చించి బీసీ సంఘాల నిరసన ప్రదర్శన

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 46తో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీసీ జేఏసీ చైర్మన్  జాజుల శ్రీనివాస్ గౌడ్  అన్నారు. ఈ జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్  చేశారు. ఆదివారం హైదరాబాద్ అంబర్ పేటలో పూలే విగ్రహం దగ్గర బీసీ సంఘాల నేతలు గుజ్జ కృష్ణ, విక్రమ్ గౌడ్, కనకాల శ్యాం, శ్రీనివాస్  ముదిరాజ్ తో కలిసి జీవో 46 కాపీలను చించి నిరసన తెలిపారు. 

ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్  మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ  మంది అగ్రవర్ణాల నేతలు సర్పంచ్​లుగా గెలవాలని బీసీల మీద కుట్రకు పాల్పడ్డారని, అందులో భాగంగానే జీవో 46 జారీ చేశారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై పోరాడకుండా, బీసీలకు సమాధానం చెప్పకుండా ప్రభుత్వం ఎందుకు పారిపోతున్నదని ఆయన ప్రశ్నించారు. జీవో నంబర్ 9 ద్వారా బీసీలకు వేల గ్రామ పంచాయతీలు రిజర్వ్  అయ్యాయని, ఆ సంతోషం జీవో 46తో పోయిందన్నారు. 

జీవో 46 బీసీలకు రాజకీయంగా అన్యాయంచేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ జీవోను రద్దు చేసి బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించే వరకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.