- కాంగ్రెస్‌పై బీసీ జేఏసీ చైర్మన్ జాజుల ఫైర్
హైదరాబాద్, వెలుగు: రిజర్వేషన్ల పరిమితి 50% మించరాదంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 బీసీలను మోసం చేయడమేనని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ జీవోను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని శనివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలో బీసీల జనాభా 60 శాతం ఉన్నా.. 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు జీవో నంబర్ 9 విడుదల చేసింది.
ఇప్పుడు దానిని రద్దు చేసి 46 జీవో తెచ్చింది. ఇది రాజకీయంగా బీసీలను అణచివేసే కుట్ర” అని శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. రాష్ట్రంలో వీలైనంత ఎక్కువ మంది రెడ్లను సర్పంచులుగా చేసేందుకే జీవో నంబర్ 46 ఉపయోగపడుతుందని, ఈ జీవో బీసీలకు రాజకీయ ఉరితాడు లాంటిదని ఆయన మండిపడ్డారు. జీవో 46 ను తక్షణమే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. జీవో 46లను వ్యతిరేకిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా జీవో ప్రతులను దహనం చేస్తామని ఆయన వెల్లడించారు.
