- బీసీ నేత జాజుల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ బడ్జెట్ సెషన్ లో బీసీ మహిళలకు సబ్ కోటా బిల్లు తీసుకురావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. సబ్ కోటా లేని మహిళా బిల్లుతో ఎలాంటి ఉపయోగం ఉండదని తెలిపారు. మహిళా బిల్లుకు సంపూర్ణ సాధికారత లభించాలంటే బీసీ మహిళలకు సబ్ కోట కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన హైదరాబాదులోని బీసీ భవన్ లో బీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొత్త క్యాలెండర్ ను బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మని మంజరి సాగర్ తో కలిసి ఆవిష్కరించారు .
ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. మహిళా బిల్లు అగ్రకుల సామాజిక వర్గాలకే అనుకూలంగా ఉందని ఆరోపించారు. సబ్ కోటా లేని మహిళా బిల్లుతో అగ్రకుల మహిళలు ప్రయోజనం పొందుతారని, బీసీ మహిళలకు నామమాత్రపు రాజకీయ ప్రాతినిధ్యం కూడా దక్కదని వివరించారు. కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లుతో బీసీలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నదని విమర్శించారు.
బీసీ మహిళలంతా సంఘటితంగా ఉద్యమించి మహిళా బిల్లులో బీసీ మహిళకు సబ్ కోట దక్కేవరకు పోరాడడానికి ముందుకు రావాలని జాజుల పిలుపునిచ్చారు. బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మని మంజరి సాగర్ మాట్లాడుతూ.. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోట దక్కించుకోవడానికి ఈ నెల 28వ తేదీ నుంచి ఢిల్లీలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో చలో ఢిల్లీ చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తారకేశ్వరి, సంధ్యారాణి, శ్యామల, కుల్కచర్ల శ్రీనివాస్, విక్రమ్ గౌడ్ పాల్గొన్నారు.
