ఖర్గేను కలిసిన కాంగ్రెస్​ బీసీ లీడర్లు.. ఉదయ్​పూర్ డిక్లరేషన్ అమలు చేయాలని విజ్ఞప్తి

ఖర్గేను కలిసిన కాంగ్రెస్​ బీసీ లీడర్లు.. ఉదయ్​పూర్ డిక్లరేషన్ అమలు చేయాలని విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు :  రాష్ట్ర కాంగ్రెస్ బీసీ లీడర్లు ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను శనివారం ఢిల్లీలో కలిశారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ అమలు చేయాలని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేయాలని కోరారు. అనంతరం తెలంగాణ భవన్‌‌లో బీసీ నేతలతో కలిసి మధుయాష్కీ గౌడ్‌‌ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ టికెట్ల కేటాయింపులో సామాజిక సమతుల్యం పాటించడం, బీసీ వర్గాలకు సీట్ల కేటాయింపుపై ఖర్గేతో చర్చించినట్టు ఆయన చెప్పారు. పార్టీలోని పాతవారితో పాటు కొత్తగా చేరిన వారెవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఖర్గే హామీ ఇచ్చారని తెలిపారు.

సీట్ల కేటాయింపులో అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఖర్గేను కలిసిన తర్వాత తామందరికీ హైకమాండ్​పై విశ్వాసం పెరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​ను అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా కలసికట్టుగా పని చేయాలని ఖర్గే సూచించారని పేర్కొన్నారు. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఖర్గేకు పూర్తి అవగాహన ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారన్నారు. తెలంగాణలో బీసీలకు ఎలాంటి అన్యాయం జరగదని అన్నారు.