మంత్రి ముందే ఖబడ్దార్ అంటూ ప్రశ్నించారు

మంత్రి ముందే ఖబడ్దార్ అంటూ ప్రశ్నించారు

హైదరాబాద్ రవీంద్ర భారతిలో కొండా లక్ష్మణ్ బాపూజీ 104వ జయంతి వేడుకల్లో నిరసన గళం వినిపించారు బీసీ నాయకులు.  బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, బీసీ ఉన్నతికి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు నేతలు. రాష్ట్ర బీసీ సంక్షేమం, సివిల్ సప్లైస్, వినియోగ దారుల వ్యవహారాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముందే ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టారు బీసీ నాయకులు.

జనాభాలో 50శాతం పైగా ఉన్న బీసీలకు టీఆర్ఎస్ పాలనలో అన్యాయం జరుగుతుందని విమర్శించారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి నాయకుడు మేకపోతుల నరేందర్. సీఎం కేసీఆర్ కావాలనే.. బడ్జెట్ లో బీసీ కమిషన్ కు నిధులు తగ్గించారని అన్నారాయన. టాపిక్ డైవర్ట్ ఎందుకు చేస్తున్నావంటూ… మంత్రి గంగుల కమలాకర్ అడిగినా… ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానలేదు బీసీ నాయకులు.

“ప్రతి బీసీ విద్యార్థికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఈసారి ప్రభుత్వ బడ్జెట్ లో బీసీలకు కావాలనే బడ్జెట్ తగ్గించారు. ఎందుకు తగ్గించారు. మేం బీసీలం 60శాతం మంది ఉన్నాం. మీరెంత బడ్జెట్ కేటాయించారు. మహాత్మా  జ్యోతిబా పూలే స్కూల్ కు వెళ్తే.. తల్లిందండ్రులు సద్దుల మూటలతో ఎదురుచూపులే మిగులుతున్నాయి. వారి బిడ్డలకు ఎందుకు అందులో సీట్లివ్వరు. సీఎం కేసీఆర్ ను మేం డిమాండ్ చేస్తున్నాం… ఇంకో 2వేల మహాత్మ జ్యోతిబా పూలే స్కూళ్లను వెంటనే ప్రారంభించాలి. సావిత్రిబాయి పూలే పేరుతో బాలికల స్కూళ్లు మరిన్ని తెరవాలి. ట్యాంక్ బండ్ పై కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం పెట్టాలి. బీసీలకు పక్కా భవనాలు నిర్మించి ఇవ్వాలి. లేకపోతే బీసీలంటే ఏంటో ప్రభుత్వానికి చూపిస్తాం” అని బీసీ నాయకులు హెచ్చరించారు.

బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు బీసీ లీడర్స్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేదికపై నినాదాలు చేశారు బీసీ సంఘం నేతలు. మంత్రి గంగుల సూచనతో .. నిరసన తెలిపిన బీసీ నేతలను నిర్వాహకులు వారించారు.