- మీ హయాంలో పెట్టుబడులు రావాలంటే కుటుంబం అనుమతి కావాలి
- ఆ గేట్పాస్ కల్చర్‌ను మేం చెరిపేసినం
- ఉత్తమ ఉద్యోగులను ఉత్సవ విగ్రహాలుగా మార్చింది కేసీఆర్ ప్రభుత్వమని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో చేసింది తక్కువ.. చెప్పుకున్నది ఎక్కువని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కేసీఆర్లాగా తమకు గాల్లో మేడలు కట్టడం రాదన్నారు. అరచేతిలో స్వర్గం చూపించడం అసలే రాదన్నారు. ఎక్కడో ఉండి పాలన సాగించిన కేసీఆర్‌కు.. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలు చేసుకోవడం హైప్లాగే కనిపిస్తుందన్నారు.
వాళ్లది హైప్ కోసం పనిచేసిన ప్రభుత్వమని.. తమ ప్రభుత్వానిది హైప్ కాదన్నారు. రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్ కోసం ప్రభుత్వం హోప్ క్రియేట్ చేస్తున్నదని పేర్కొన్నారు. సోమవారం ఆయన సెక్రటేరియెట్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రానికి పరిశ్రమలు రావొద్దు.. పెట్టుబడులు రావొద్దు.. ఇక్కడి యువతకు ఉద్యోగాలు రావొద్దన్నదే బీఆర్ఎస్ పాలసీ. అందుకే పెట్టుబడులు పెట్టిన దిగ్గజ సంస్థలను కించపరిచేలా మాట్లాడారు. ఒక సీనియర్నాయకుడిగా ఇది మీకు తగదు.
మీ హయాంలో ఏ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా మీ కుటుంబం అనుమతి తప్పనిసరి. అవునా.. కాదా? మేము ఆ గేట్ పాస్ కల్చర్ కు ఫుల్ స్టాప్ పెట్టాం. అందుకే ఈరోజు గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్స్ కు తెలంగాణ ఒక చాయిస్ కాకుండా.. గమ్యస్థానంగా మారింది. ప్రపంచ పరిశ్రమలు క్యూ కడుతున్నయ్’’ అని ఆయన చెప్పారు. విమర్శలు చేసే ముందు ఒకసారి గతం కూడా చూసుకోవాలన్నారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వమని.. ఇక్కడ పరదాలుకాదు.. కేవలం ప్రగతి మాత్రమే ఉందని చెప్పారు.
మీ హయాంలో వచ్చిన ఒక్క కంపెనీ అయినా పెట్టుబడులు పెట్టిందా
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌లో మేం చేసుకున్న రూ.5.75 లక్షల కోట్ల ఎంవోయూలు అబద్ధమైతే.. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఎంవోయూలు కూడా అబద్ధమేనా అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఎంవోయూలు జరిగిన ఒక్క కంపెనీ అయినా పెట్టుబడి పెట్టిందా అని నిలదీశారు.
ఒక్కో ఎంవోయూ గ్రౌండింగ్ అయ్యేందుకు చాలా సమయం పడుతుందన్నారు. ప్రతి ఎంవోయూను గ్రౌండింగ్ చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని వివరించారు. ‘‘మీ హయాంలో ఓ అధికారి మంచి పాలసీని రూపొందించారని చెప్పారు. కానీ, ఆ పాలసీలో ఉన్న నిబంధనలను మీరు అమలు చేశారా? ఉత్తమ ఆఫీసర్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చి, సెక్రటేరియెట్ కే వెళ్లకుండా పాలన సాగించిన చరిత్ర మీది” అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
