BC Quota Ordinance: బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ను గవర్నర్కు పంపిన తెలంగాణ సర్కార్

BC Quota Ordinance: బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ను గవర్నర్కు పంపిన తెలంగాణ సర్కార్

హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు పంపింది. ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్కు పంపినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 285(ఏ)కు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ముసాయిదాను పంచాయతీ రాజ్ శాఖ న్యాయ శాఖ పరిశీలనకు పంపింది. న్యాయ శాఖ పరిశీలన అనంతరం గవర్నర్ ఆమోదం కోసం ఈ ఆర్డినెన్స్ను ప్రభుత్వం రాజ్ భవన్కు పంపడం గమనార్హం. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ‘పంచాయతీ రాజ్ చట్టం 2018’ లో ప్రభుత్వం చిన్న సవరణ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇందులోని 285(ఏ) సెక్షన్లో ఉన్న ‘‘స్థానిక సంస్థల్లో 50 శాతం మించకుండా రిజర్వేషన్లు అమలవుతాయి’’ అనే వాక్యం తొలగించి, ‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలవుతాయి’’ అని చేర్చి, ఆర్డినెన్స్ జారీ చేయడం గమనార్హం. ఈ ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదంతో పంచాయతీరాజ్ సవరణ చట్టం అమల్లోకి వస్తుంది. ఆ వెంటనే  స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ఖరారు కోసం.. ఇప్పటికే ఉభయసభలు ఆమోదించిన బిల్లు, కులగణన సర్వే ఎంపిరికల్ డేటా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇస్తుంది. రిజర్వేషన్ల ఖరారుకు హైకోర్టు పెట్టిన డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

రిజర్వేషన్ల ప్రకారం ముందు ఎస్సీ, ఎస్టీలకు ఆయా చోట్ల జనాభా ఆధారంగా సీట్లు కేటాయించిన తర్వాత బీసీలకు రిజర్వ్​చేస్తారు. రాబోయే వారం, పది రోజుల్లో బీసీ డెడికేటెడ్​ కమిషన్ రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. ఆ నివేదిక సర్కారుకు అందగానే ఆ ప్రకారం ఎన్నికల కమిషన్​ నోటిఫికేషన్​జారీ చేసే అవకాశం ఉంది. గతంలో చేసిన పంచాయతీరాజ్​చట్టానికి చిన్న సవరణే కావడం వల్ల ఆర్డినెన్స్కు గవర్నర్ నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండదని ప్రభుత్వం భావిస్తున్నది. అలాగే ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఎవరూ కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదని, జీవోల పైన మాత్రమే వెళ్లే అవకాశముంటుందని అంచనా వేస్తున్నది.