- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: జనగణనలో బీసీ కులగణనను చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమం చేపడుతున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో చేసిన బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించాలని కోరారు. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న ఇంటింటి గణనలో 33 ప్రశ్నలను రూపొందించారని, వాటిలో ఎస్సీ, ఎస్టీల వివరాలు అడుగుతూ బీసీల సంఖ్యను విస్మరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీసీల హక్కుల సాధన కోసం జరుగుతున్న ఈ పోరాటానికి మద్దతుగా దేశంలోని 29 రాష్ట్రాల నుంచి బీసీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
