మోదీ, రాహుల్ కులాలు తెలియాలంటే దేశంలోకులగణన చేయాలె : జాజుల శ్రీనివాస్

మోదీ, రాహుల్ కులాలు తెలియాలంటే దేశంలోకులగణన చేయాలె : జాజుల శ్రీనివాస్
  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ 

ఎల్బీనగర్, వెలుగు: ప్రధాని మోదీ, కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ కులం బయటపడాలంటే దేశవ్యాప్త కులగణన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్​ చేశారు. వారి నాయకుల కులాలపై పరస్పర విమర్శలు చేసుకుంటున్న ఆ పార్టీలకు నిజంగానే బీసీలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే  కుల గణన చేపట్టాలని అన్నారు.  శనివారం హైదరాబాద్​లోని ఎల్బీనగర్ లో బొమ్మగాని ధర్మబిక్షం 103వ జయంతి వేడుకలు నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి హాజరైన జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కొందరు బీసీ కులాలను అడ్డం పెట్టుకొని రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బీసీ వాదం కంటే ఎక్కువ హిందూవాదంపైన పనిచేస్తున్నారని, అలాంటి నేతనూ ఆ పార్టీ బీసీ అయినందునే నిర్లక్ష్యం చేస్తున్నదని అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమాల్లో పాల్గొంటూనే అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన మహనీయుడు ధర్మభిక్షం అని పేర్కొన్నారు.