
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 9 ద్వారా పెంచిన బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ ఈ నెల 13న నేషనల్ హైవేలను దిగ్బంధం చేయాలని నిర్ణయించినట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. శుక్రవారం సెక్రటేరియెట్ మీడియా పాయింట్లో జాజుల మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ వ్యతిరేకుల వైఖరిని ఎండగడుతూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించామన్నారు.
హైదరాబాద్లోని బషీర్ బాగ్ లో ఉన్న బాబు జగ్జీవన్ రావ్ విగ్రహం వద్ద, ఉస్మానియా యూనివర్సిటీలోనూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఇది ప్రారంభం మాత్రమేనని.. శనివారం నుంచి బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేసి బీసీల తడాఖా చూపిస్తామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఇందులో భాగంగా శనివారం హైదరాబాద్లోని కళింగ భవన్లో అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాలు, కుల సంఘాలు, మేధావులు, సామాజికవేత్తలతో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశామని వెల్లడించారు.
బీసీ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేసి.. బీసీ రిజర్వేషన్లను రక్షించుకోవడానికి భవిష్యత్ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, మని మంజరి సాగర్, మహేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.