ముషీరాబాద్, వెలుగు: 42 శాతం బీసీ రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతనే జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ర్యాగ అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో జరిగిన బీసీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ సరైన రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు అందకపోవడం అన్యాయమన్నారు.
అత్యధిక జనాభా ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో తగిన ప్రాధాన్యం లేకపోవడం బాధాకరమన్నారు. రాహుల్ గాంధీ బీసీ రిజర్వేషన్లపై మాట్లాడుతున్నారని, కామారెడ్డి డిక్లరేషన్ అమలులో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో నిర్ణయం తీసుకొని బీసీలకు న్యాయం చేయాలని కోరారు.
