
- ఈ నెలలోనే ఐపీఎల్‌ను పూర్తి చేయాలని బీసీసీఐ ప్లాన్
- నేడు లీగ్ గవర్నింగ్ కౌన్సిల్, బోర్డు పెద్దల సమావేశం
- కేంద్రం పర్మిషన్ ఇస్తే 16 లేదా 17న ఆట తిరిగి ప్రారంభం!
ముంబై: ఇండియా–-పాకిస్తాన్ పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడంతో ఐపీఎల్‌ను తిరిగి పట్టాలెక్కించే పనులు మొదలయ్యాయి. మిగిలిన 16 మ్యాచ్‌లను ఈ నెలలోనే నిర్వహించి లీగ్‌ను పూర్తి చేసే ప్రక్రియను బీసీసీఐ వేగవంతం చేసింది. ఇందుకోసం బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆదివారం సమావేశమై లీగ్ రీస్టార్ట్‌పై చర్చిస్తాయని బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు. ‘యుద్ధం ఆగిపోయింది. బీసీసీఐ సెక్రటరీ, అధికారులు, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్లతో ఆదివారం సమావేశమై లీగ్ రీస్టార్ట్ విషయంపై చర్చిస్తారు. టోర్నమెంట్‌ను పూర్తి చేయడానికి ఏది బెస్ట్ షెడ్యూల్ అవుతుందో చూద్దాం’ అని పేర్కొన్నారు. కేంద్రం ప్రభుత్వం క్లియరెన్స్ ఇస్తే ఈనెల 16–17వ తేదీల్లో లీగ్‌ను రీస్టార్ట్ చేయాలని బోర్డు భావిస్తోంది. ఈ నెలాఖరు నాటికి టోర్నమెంట్‌ను పూర్తి చేయడానికి డబుల్ హెడర్ మ్యాచ్‌ల సంఖ్యను పెంచే అవకాశం ఉంది.
హైదరాబాద్, చెన్నై, బెంగళూరు షార్ట్‌లిస్ట్!
ప్రస్తుతానికి ధర్మశాల మినహా అన్ని పాత వేదికల్లో మ్యాచ్ నిర్వహించాలని భావిస్తోంది. దీంతో పాటు సౌతిండియాలో మూడు నగరాల్లో మిగిలిన లీగ్ మ్యాచ్‌లను నిర్వహించాలన్న ఆఫ్షన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, యుద్ధ పరిస్థితుల్లో మాత్రమే ఈ ఆప్షన్‌ను ఎంచుకునే అవకాశం ఉందని శుక్లా అన్నారు. ‘కాల్పుల విరమణ ప్రకటన ఇప్పుడే వచ్చింది. మాకు కొంత టైమ్ ఇస్తే చర్చించి ఓ నిర్ణయం తీసుకోగలుగుతాం’ అని చెప్పారు. లీగ్ బ్రాడ్‌కాస్టర్, ప్రొడక్షన్ టీమ్స్ కదలికను అర్థం చేసుకున్న ఐపీఎల్ అధికారి ఒకరు లీగ్ రీస్టార్ట్ అయితే ఎక్కువ వేదికలు తమ మ్యాచ్‌లను కోల్పోయే అవకాశం లేదని చెప్పారు. అయితే, ధర్మశాలను మాత్రం లిస్ట్ నుంచి తొలగిస్తారని తెలిపారు. ‘ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణం పెరుగుతుప్పుడు మాత్రమే బ్రాడ్‌కాస్టర్స్, దాని ప్రొడక్షన్ యూనిట్‌ను బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలోనే ఉంచమని కోరారు. కానీ కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత సిబ్బందిని ఒరిజినల్ వేదికల్లోనే ఉంచాలని ఆశించారు. కాబట్టి ధర్మశాలలో జరిగే రెండు మ్యాచ్‌లను మాత్రమే వేరే చోటు (అహ్మదాబాద్)కు మార్చే అవకాశం ఉంది. కోల్‌కతా వంటి వేదికల్లో షెడ్యూల్ చేసిన అన్ని మ్యాచ్‌లు జరుగుతాయి’ అని పేర్కొన్నారు.ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో లీగ్‌ను వారం పాటు నిలిపివేస్తూ బీసీసీఐ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
మే దాటితే కష్టమే..
మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించేందుకు షెడ్యూల్ చేసే విండో ఈ నెల 25 తేదీని దాటితే మాత్రం పలువురు కీలక ప్లేయర్ల సేవలు కోల్పోయే అవకాశం ఉంది. ఎందుకంటే జూన్ 11 నుంచి లార్డ్స్‌లో ఆస్ట్రేలియా–-సౌతాఫ్రికా మధ్య వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మొదలవడంతో పాటు అనేక బైలేటరల్ సిరీస్‌లతో ఆటగాళ్లు బిజీగా మారుతారు.
ఫారిన్ ప్లేయర్లు తిరిగొస్తారా?
మేలోనే లీగ్‌ను పూర్తి చేయాలంటే బీసీసీఐ ముందున్న అతి పెద్ద సవాలు ఫారిన్ క్రికెటర్లను తిరిగి రప్పించడం. లీగ్‌ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన వెంటనే ఆయా ఫ్రాంచైజీల ఆటగాళ్లు తమ స్వదేశాలకు పయణం అయ్యారు. ఈ నెల చివర్లో టోర్నమెంట్ రీస్టార్ట్ అయితే చాలా మంది ఫారిన్ ప్లేయర్లు తిరిగి వస్తారని ఫ్రాంచైజీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అనేక ఫ్రాంచైజీలు ఇండియాకు తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్‌ను కోరినట్టు తెలుస్తోంది. ఇంకా ఇండియాలోనే ఉన్న కొంతమంది ఆటగాళ్ళు, సహాయక సిబ్బందిని ప్రస్తుతానికి తమ ప్రయాణాన్ని నిలిపివేయమని కోరారు. ఆదివారం తమ స్వదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్న తమ సపోర్ట్ స్టాఫ్‌ను ఓ ఫ్రాంచైజీ ఇక్కడే ఉండిపోవాలని సూచించింది. గుజరాత్ టైటాన్స్ విదేశీ ఆటగాళ్లలో - జోస్ బట్లర్, గెరాల్డ్ కోయెట్జీ- మాత్రమే దేశం విడిచి వెళ్ళారు. జీటీ ఫ్రాంచైజీ ఈ ఇద్దరినీ తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.