భారత మహిళల జట్టు తొలిసారి వరల్డ్ కప్ గెలిచి విశ్వ విజేతగా నిలిచింది. సొంతగడ్డపై అంచనాలను అందుకంటూ 2025 వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్ గా అవతరించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని టీమిండియా ఫైనల్లో 52 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించి టైటిల్ అందుకుంది. ఆదివారం (నవంబర్ 2) ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియంలో సౌతాఫ్రికాతో జరిగిన ఈ ఫైనల్లో మొదట బ్యాటింగ్ లో భారీ స్కోర్ చేసిన టీమిండియా.. ఆ తర్వాత బౌలింగ్ లో సమిష్టిగా రాణించి వరల్డ్ కప్ ట్రోఫీ అందుకుంది. మరోవైపు తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టిన సౌతాఫ్రికాకు నిరాశే మిగిలింది.
తొలిసారి విశ్వ విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. భారత జట్టు, సపోర్టింగ్ స్టాఫ్, కోచ్ లకు కలిపి రూ.51 కోట్ల రూపాయల నగదు ప్రకటించారు. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ ఐసీసీ చైర్మన్ జై షా ఇండియాలో మహిళల క్రికెట్‌కు ఎంతగానో దోహదపడ్డారని మాట్లాడుతూ భారీ నగదు బహుమతిని కూడా ప్రకటించారు. మొత్తం రూ. 51 కోట్లను భారత జట్టుతో పాటు సపోర్టింగ్ స్టాఫ్, కోచ్ లు పంచుకుంటారు. విజేతగా నిలిచిన భారత జట్టుకు ఐసీసీ ప్రైజ్ మనీ రూ. 39 కోట్ల రూపాయలు అందుతాయి.
సైకియా మాట్లాడుతూ.. "జై షా బీసీసీఐ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి, ఆయన మహిళా క్రికెట్‌లో అనేక పరివర్తనలు తీసుకొచ్చారు. వేతన సమానత్వం గురించి కూడా చర్చించారు. గత నెలలో ఐసీసీ చైర్మన్ జై షా మహిళల ప్రైజ్ మనీని 300% పెంచారు. గతంలో, ప్రైజ్ మనీ $2.88 మిలియన్లు ఉండగా.. ఇప్పుడు దానిని $14 మిలియన్లకు పెంచారు. ఈ చర్యలన్నీ మహిళా క్రికెట్‌ను బాగా ప్రోత్సహించాయి. బీసీసీఐ మొత్తం జట్టు క్రీడాకారులు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి రూ.51 కోట్ల రివార్డు బహుమతిని ప్రకటించింది". అని దేవజిత్ సైకియా తెలిపారు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. షెఫాలీ 87 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ వీరోచిత సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. షెఫాలీ వర్మ, దీప్తి శర్మ ఆల్ రౌండ్ షోతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. షెఫాలీ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి
BCCI announces Rs 51 crore cash reward for ICC Women's WC winning Team India
— ANI Digital (@ani_digital) November 2, 2025
Read @ANI Story | https://t.co/Jyl0avZI8J#BCCI #DevajitSaikia #TeamIndia #ICCWomensCricketWorldCup #cricket #INDvsSA pic.twitter.com/AhXjJPQW3H
