స్వదేశంలో వరల్డ్ కప్ గెలిచి ఫుల్ జోష్ లో ఉన్న భారత మహిళలు జట్టు ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు సిద్ధమయ్యారు. నవంబర్ 2 తర్వాత భారీ విరామం తీసుకొని శ్రీలంకతో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనున్నారు. బంగ్లాదేశ్ తో జరగాల్సిన వన్డే, టీ20 సిరీస్ రద్దు కావడంతో శ్రీలంకతో సిరీస్ కు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ లో బంగ్లాతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ తో పాటు.. మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. అయితే.. రెండు దేశాల మధ్య పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ సిరీస్ రద్దు చేయబడింది. ఈ ఏడాది ఆగస్టులోరాజకీయ కారణాల వలన బంగ్లాదేశ్ తో టీమిండియా మెన్స్ జట్టు వైట్ బాల్ సిరీస్ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.
డిసెంబర్ 21 నుంచి ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ప్రారంభమవుతోంది. తొలి రెండు టీ20 మ్యాచ్ లు వరుసగా 21,23 తేదీల్లో విశాఖపట్నంలో జరుగుతాయి. సిరీస్ లోని చివరి మూడు టీ20 మ్యాచ్ లు డిసెంబర్ 26, 28, 30 తేదీల్లో తిరువనంతపురం వేదిక కానుంది. వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత భారత మహిళలు జట్టు 2026 టీ20 వరల్డ్ కప్ పై దృష్టి పెట్టనుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి 2024 టీ20 వరల్డ్ కప్ లో గ్రూప్ దశలోనే భారత మహిళల జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. త్వరలోనే భారత జట్టు స్క్వాడ్ ను ప్రకటించనున్నారు.
2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ ముందు టీమిండియా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి పటిష్టమైన జట్లతో తలపడాల్సి ఉంది. ఫిబ్రవరి 2026లో ఆస్ట్రేలియాతో.. ఇంగ్లాండ్ తో సిరీస్ మే 2026లో జరుగుతుంది. టీ20 వరల్డ్ కప్ ముందు పటిష్టమైన జట్లతో ఆడబోతున్న టీమిండియా ఎలా రాణిస్తుందో ఆసక్తికరంగా మారింది. వన్డే వరల్డ్ కప్ తొలి సారి గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు టీ20 వరల్డ్ కప్ కలను నెరవేర్చుకుంటుందో లేదో చూడాలి. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది.
శ్రీలంకతో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు షెడ్యూల్:
1వ టీ20 డిసెంబర్ 21 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం
2వ టీ20 డిసెంబర్ 23 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం
3వ టీ20 డిసెంబర్ 26 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం
4వ టీ20 డిసెంబర్ 28 గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం
5వ టీ20 డిసెంబర్ 30 గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం
