Ravi Shastri: రవిశాస్త్రి సేవలను గుర్తించిన బీసీసీఐ.. ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక

Ravi Shastri: రవిశాస్త్రి సేవలను గుర్తించిన బీసీసీఐ.. ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక

ఆటగాడిగా, కోచ్‌గా జాతీయ జట్టుకు విశిష్ట సేవలందించిన భారత మాజీ దిగ్గజం రవిశాస్త్రికి.. భారత క్రికెట్ నియంత్రణా మండలి(బీసీసీఐ) సముచిత స్తానం కల్పిచింది. మంగళవారం (జనవరి 23) హైదరాబాద్‌లో జరిగే బీసీసీఐ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించనుంది. 

1983 ప్రపంచ కప్ విన్నింగ్ జట్టులో రవి శాస్త్రి ఒకరు. ఆయన క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక భారత జట్టుకు డెరెక్టర్‌గా, కోచ్ గా పనిచేశారు. 2014లో టీమిండియా డెరెక్టర్ గా వ్యవహరించిన రవిశాస్త్రి.. 2017లో హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. అతను హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో టీమిండియా ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందుకుంది. అందునా రవి శాస్త్రి- విరాట్ కోహ్లి కాంబినేషన్‌లో మూడు ఫార్మాట్లలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రపంచ క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా అవతరించింది. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో ఆస్ట్రేలియాను వారి దేశంలో ఓడించి సిరీస్‌ నెగ్గడం మరుపురానిది.

జట్టు విజయం సాధించినప్పుడు ప్రశంసలు అందుకునే రవిశాస్త్రి..ఓడిపోయిన సందర్భాల్లో విమర్శలూ అదే స్థాయిలో ఎదుర్కొనేవారు. ఓడిన ప్రతీసారి జట్టు కెప్టెన్ కోహ్లీని, కోచ్ రవిశాస్త్రినే అందరూ నిందించేవారు. రవిశాస్త్రిని తొలగించాలంటూ విమర్శకులు బీసీసీఐని డిమాండ్ చేసిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. తన పదవీకాలంలో మిశ్రమ ఫలితాలు చూసిన శాస్త్రి.. 2021 టీ20 వరల్డ్ కప్ అనంతరం ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

క్రికెట్ కెరీర్

1981లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రవిశాస్త్రి భారత జట్టు తరపున 80 టెస్టులు, 150 వన్డేలు ఆడారు. ఆయన 1992లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. రవిశాస్త్రి మంచి ఆల్-రౌండర్ కూడానూ. టెస్ట్‌ల్లో 3830 పరుగులు చేయడంతో పాటు 151 వికెట్లు పడగొట్టారు. ఇక వన్డేల విషయానికి వస్తే 129 వికెట్లు తీయడంతో పాటుగా 3108 పరుగులు చేశారు.