
న్యూఢిల్లీ: టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా హైదరాబాదీ టి. దిలీప్ తిరిగొచ్చాడు. ఏడాది పాటు తను ఈ పోస్టులోపని చేస్తాడు. బీసీసీఐ గత నెలలో దిలీప్, అభిషేక్ నాయర్‌ను కోచింగ్ స్టాఫ్ నుంచి తొలగించింది. నాయర్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు తిరిగి వెళ్లగా దిలీప్ ఏ ఐపీఎల్ జట్టులో చేరలేదు. అయితే, ఫీల్డింగ్ కోచ్‌గా ఫారినర్‌ను నియమించాలని బీసీసీఐ భావించినప్పటికీ సరైన వ్యక్తి లభించకపోవడంతో దిలీప్‌నే తిరిగి నియమించాలని డిసైడింది. ‘దిలీప్ మంచి కోచ్. మూడేళ్లకు పైగా జట్టుకు సేవలు అందించాడు. అతనికి చాలా మంది క్రికెటర్లు బాగా తెలుసు. కాబట్టి ఇంగ్లండ్‌తో జరిగే సుదీర్ఘ సిరీస్‌లో దిలీప్‌ను కొనసాగించడం జట్టుకు మంచిది’ అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు.
ఇక, నెదర్లాండ్స్ మాజీ క్రికెటర్ ర్యాన్ టెన్ దష్కటే ఈ నెల 30 నుంచి ఇంగ్లండ్ లయన్స్ తో జరిగే అనధికారిక టెస్ట్ సిరీస్‌లో ఇండియా–ఎ జట్టుతో కలిసి పనిచేయనున్నాడు. ప్రస్తుతం హృషికేశ్ కనిత్కర్ ఇండియా–ఎ టీమ్‌కు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. మరోవైపు టెస్టు టీమ్ కొత్త కెప్టెన్ శుభమన్ గిల్, యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఇంగ్లండ్ లయన్స్‌తో జూన్ 6న మొదలయ్యే రెండో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్ ఫైనల్ జూన్ 3న అహ్మదాబాద్‌లో జరగనుంది. ఒకవేళ గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే ఈ ఇద్దరు మ్యాచ్‌కు ముందు ఇండియా–ఎ టీమ్‌లో చేరడం ఇబ్బందిగా మారనుంది. అలాగే, ఇంగ్లండ్‌లోని వాతావరణ పరిస్థితులకు, రెడ్-బాల్ ఫార్మాట్‌కు అలవాటు పడేందుకు కొంత సమయం పట్టనుంది.