- బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవులు
ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు పేర్కొన్నారు. ప్రొఫెసర్ బెనర్జీ అధ్యక్షతన ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, వనరులపై నియంత్రణ, బడ్జెట్లో వాటా, రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా ‘హిస్సా, ఇజ్జత్, హుకుమత్’ నినాదంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
8 దశాబ్దాలుగా బీసీ సమాజం ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక అన్యాయాలను వివరించాలని సూచించారు. రాజ్యాధికారం లేకుండా ఏ సమాజం తన అస్తిత్వాన్ని, అభివృద్ధిని కాపాడుకోలేదని తెలిపారు.
బీసీలు సంఘటిత శక్తిగా ఎదిగి రాజ్యాధికారాన్ని సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రొఫెసర్ విజయ్ బాబు, ప్రొఫెసర్ సాయిలు, ప్రొఫెసర్ శ్రీనివాసులు, ప్రొఫెసర్ ప్రసాద్ గౌడ్, ప్రొఫెసర్ వీరాస్వామి, చెన్న శ్రీకాంత్, వేణు, వెంకన్న, లింగేశ్ యాదవ్ పాల్గొన్నారు.
