మంచిర్యాల కార్పొరేషన్ లో సగానికి పైగా బీసీలకే..

మంచిర్యాల కార్పొరేషన్ లో సగానికి పైగా బీసీలకే..
  • మున్సిపాలిటీల్లో మెజారిటీ ​సీట్లు వారికే
  • మంచిర్యాల కార్పొరేషన్​లో 41 డివిజన్ల కాంగ్రెస్ ​అభ్యర్థులు బీసీలే..
  • అదే స్థాయిలో కేటాయించిన ఇతర పార్టీలు  
  • రిజర్వ్డ్​సీట్లు సహా జనరల్​లోనూ చాన్స్​

మంచిర్యాల, వెలుగు:  మున్సిపల్​ఎన్నికల్లోనూ ప్రధాన రాజకీయ పార్టీలు బీసీ నినాదం ఎత్తుకున్నాయి. జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు అదే స్థాయిలో కౌన్సిలర్, కార్పొరేటర్ సీట్లు కేటాయించాయి. కాంగ్రెస్​ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ బిల్లుపై హైకోర్టులో కేసు పెండింగ్​ఉండడంతో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీపరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం రేవంత్​రెడ్డి హామీ ఇవ్వడం తెలిసిందే. ఆ మేరకు పంచాయతీల్లో బీసీలకు అవకాశం కల్పించడంతో పెద్ద సంఖ్యలో వార్డు మెంబర్లు, సర్పంచ్​లుగా ఎన్నికయ్యారు. తాజా మున్సిపల్​ఎన్నికల్లోనూ కాంగ్రెస్​అదే ఒరవడిని కొనసాగిస్తూ బీసీలకు కౌన్సిలర్, కార్పొరేటర్​టికెట్ల కేటాయింపులో పెద్దపీట వేసింది.

దీంతో మిగతా పార్టీలు సైతం కాంగ్రెస్ బాటలోనే బీసీలకు ప్రాధాన్యం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. భారీ సంఖ్యలో ఓటు బ్యాంకు కలిగిన బీసీలను నిర్లక్ష్యం చేస్తే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయనే భయం అన్ని పార్టీలకు పట్టుకుంది. ఈ కారణంగా మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వుడ్​సీట్లతో పాటు అన్​రిజర్వ్డ్(జనరల్) స్థానాల్లోనూ పోటాపోటీగా బీసీ అభ్యర్థులను ప్రకటించాయి. మంచిర్యాల కార్పొరేషన్​సహా అన్ని మున్సిపాలిటీల్లో మెజారిటీ డివిజన్లు, వార్డులను బీసీలకు కేటాయించాయి. 

మంచిర్యాల కార్పొరేషన్​లో 41 సీట్లు

మంచిర్యాల మున్సిపల్​కార్పొరేషన్​లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు రూలింగ్​మేరకు బీసీ డెడికేటెడ్​కమిషన్​రికమండేషన్స్​ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదిక సీట్లు కేటాయించగా, మిగతా సీట్లను బీసీలకు రిజర్వ్​చేశారు. ఈ లెక్కన కార్పొరేషన్​పరిధిలో ఎస్టీ 1, ఎస్సీ 9, బీసీ 20, జనరల్​30 స్థానాలు దక్కాయి. బీసీ రిజర్వ్డ్, జనరల్ కేటగిరీ కలిపి 50 స్థానాలకు గాను కాంగ్రెస్​41 డివిజన్లలో బీసీలను బరిలో నిలిపింది.

ఎస్సీలకు 10, ఎస్టీకి 1, జనరల్​కు​8 సీట్లు కేటాయించింది. బీఆర్ఎస్​43 స్థానాల్లో బీసీ అభ్యర్థులను ప్రకటించగా, ఎస్సీలకు 11, ఎస్టీ 01, జనరల్​కు 05 స్థానాలు కేటాయించింది. అలాగే బీజేపీ బీసీ 42, ఎస్సీ 10, ఎస్టీ 1, జనరల్ కు​5 సీట్లు ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో సగానికిపైగా టికెట్లు బీసీలకు దక్కాయి. నిర్మల్​మున్సిపాలిటీలోని 42 వార్డుల్లో బీఆర్​ఎస్​ఏకంగా 38 మంది బీసీలకే  టికెట్లు ఇచ్చింది.