పేషెంట్లకు మర్యాద ఇయ్యాలె

పేషెంట్లకు మర్యాద ఇయ్యాలె

 డాక్టర్లు, హెల్త్ స్టాఫ్‌‌‌‌‌‌‌‌తో  హెల్త్‌‌‌‌‌‌‌‌ మినిస్టర్ హరీశ్‌‌‌‌‌‌‌‌రావు
హైదరాబాద్, వెలుగు:
ప్రభుత్వ దవాఖాన్లకు వచ్చే పేషెంట్లు, వారి అటెండర్లతో మర్యాదగా వ్యవహరించాలని డాక్టర్లు, హెల్త్ స్టాఫ్‌‌‌‌‌‌‌‌కు మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు సూచించారు. గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, హెచ్‌‌‌‌‌‌‌‌వోడీలతో శుక్రవారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. డీఎంఈ రమేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, టీఎస్‌‌‌‌‌‌‌‌ఎంఎస్‌‌‌‌‌‌‌‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్లపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగేలా వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. చికిత్స విషయంలో రెండు దవాఖాన్లకూ మంచి పేరు ఉందన్నారు. వార్డుల్లో ఉన్న పేషెంట్లను ఆయా విభాగాల హెచ్‌‌‌‌‌‌‌‌వోడీలు పలకరించాలని, ఆరోగ్య సేవలు ఎలా అందుతున్నాయో, సిబ్బంది ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకోవాలని సూచించారు. ఎమర్జెన్సీ కేసులు వచ్చినప్పుడు స్పీడ్‌‌‌‌‌‌‌‌గా స్పందించాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ కింద ఎక్కువ మందికి చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా సోకిన గర్భిణులకు వైద్య సేవలు అందించిన గాంధీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లోని గైనిక్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ డాక్టర్లను మంత్రి అభినందించారు. సీ సెక్షన్‌‌‌‌‌‌‌‌ డెలివరీలు తగ్గించి, నార్మల్ డెలివరీలు ఎక్కువగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండు హాస్పిటళ్లలో జరుగుతున్న సివిల్ వర్క్స్‌‌‌‌‌‌‌‌ను వెంటనే పూర్తి చేయాలన్నారు.