గల్లీల్లో ముఖం చూపించలేకనే ఢిల్లీలో తిరుగుతున్నరు.. బీర్ల ఐలయ్య

గల్లీల్లో ముఖం చూపించలేకనే ఢిల్లీలో తిరుగుతున్నరు.. బీర్ల ఐలయ్య
  • కేటీఆర్, హరీశ్ రావుపై ప్రభుత్వ విప్​
  • ఒక్క ఎంపీ సీటు గెల్వని వాళ్లకు అక్కడేం పని?
  • బీజేపీలో బీఆర్ఎస్​ను విలీనం చేసేందుకు సిద్ధపడ్డారని కామెంట్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు.. గల్లీల్లో ముఖం చూపించుకోలేకనే ఢిల్లీలో తిరుగుతున్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విమర్శించారు. బీజేపీతో దోస్తానా కోసమే ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని అన్నారు. ఏం ముఖం పెట్టుకొని అక్కడ ప్రెస్​మీట్ పెట్టారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీలోని సీఎల్పీ ఆఫీస్​లో మంగళవారం బీర్ల ఐలయ్య మీడియాతో మాట్లాడారు.

‘‘బీఆర్ఎస్​ను బీజేపీలో విలీనం చేసేందుకు కేటీఆర్, హరీశ్ రావు సిద్ధపడ్డరు. లోక్​సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా గెల్వలేదు. అలాంటిది.. ఢిల్లీలో వాళ్లకేం పని? జైల్లో ఉన్న కవితను కలిసేందుకు వెళ్లిన ప్రతి సారీ ప్రెస్​మీట్ పెట్టి విమర్శించడం అలవాటైపోయింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిందే బీఆర్ఎస్.. వాళ్లు చేస్తే సంసారం.. మేము చేస్తే ఇంకొకటా?’’అని అన్నారు. ప్రజా పాలన, సంక్షేమ పథకాలు చూసి తెలంగాణ అభివృద్ధి కోసం.. రాజ్యాంగబద్ధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారు.

తాము పార్టీ ఫిరాయింపులకు పాల్పడటం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం దందాలు, కాంట్రాక్టుల కోసమే ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరారని ఆరోపించారు. త్వరలో మరో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లో చేరనున్నారని అన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎల్పీ కూడా విలీనం అవుతుందని తెలిపారు. ‘‘ప్రజల పేగు బంధాన్ని కేసీఆర్ తెంచిండు. తెలంగాణలో బీఆర్ఎస్​కు మనుగడ లేదు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేపట్టడంతో చూసి ఓర్వలేకపోతున్నరు. ఇచ్చిన హామీలు అమలు చేస్తుంటే.. కండ్లు మండుతున్నయ్.. రాష్ట్ర అభివృద్ధి బీఆర్ఎస్ నేతలకు కనిపించట్లేదా?’’అని అన్నారు.