ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు ఎంత ఫాస్ట్ గా ఉన్నారో చెప్పనవసరం లేదు. ఎల్ కేజీ పిల్లలు కూడా మన ప్రధాని ఎవరంటే టక్కున మోడీ అని చెప్తారు. ఇక ఐదో తరగతి చదివే పిల్లలకు ప్రపంచ విషయాలపై కాస్తా.. కూస్తో అవగాహన ఉంటుంది. ఒకవేళ తెలియక పోతే వెంటనే గూగుల్ తల్లిని అడిగి విషయం తెలుసుకుంటారు. ఇంత ఫాస్ట్ గా ఉన్న ఈ రోజుల్లో ఓ ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థులకు దేశం పేరు తెలియదు...తొమ్మిదో తరగతి విద్యార్థులకు ప్రధాని పేరు తెలియదంటే మన దేశంలో ప్రభుత్వ విద్యావ్యవస్థ ఏ పరిస్థితిలో ఉందో అర్దమవుతుంది.
బీహార్ రాష్రంలోని కైమూర్ కెదుల్లిపూర్ పంచాయతీలో ఉన్న మిడిల్ స్కూల్ బహురా విద్యార్థులకు దేశ విషయాలపై ఏమాత్రం అవగాహన లేదు. వారికి దేశం పేరు తెలియదు... అంతేకాదు నిత్యం వార్తల్లో ఉండే వ్యక్తి ప్రధాని పేరును కూడా చెప్పలేకపోయారు. ఈ పాఠశాలకు డీఎం సావన్ కుమార్ తనిఖీ కోసం వెళ్లారు. రికార్డులను పరిశీలించిన తరువాత విద్యార్థుల నాలడ్జిని తెలుసుకునేందుకు తరగతి గదులకు వెళ్లారు. ఐదో తరగతి విద్యార్థులను మనదేశం పేరు చెప్పమని అడగ్గా.. వారు చెప్పలేకపోయారు. ఇక అక్కడి నుంచి అదే గ్రామంలోని ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి క్లాస్ రూంలోకి వెళ్లి మన ప్రధాని ఎవరు అని అడగ్గా.. వారు కూడా సమాధానం చెప్పలేదు. దీంతో బీహార్ ప్రభుత్వ పాఠశాల్లో విద్యా ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్దమవుతోంది. స్కూళ్ల డీఎంగా సావన్ కుమార్ నియామకం జరిగినప్పటినుంచి పాఠశాలలను తనిఖీ చేస్తున్నారు. అయినా స్కూళ్లలో విద్యావ్యవస్థ మెరుగు పడలేదు. దీంతో ఆయన స్కూళ్ల ప్రధానోపాద్యాయులను హెచ్చరించారు.
ఓ పక్క ప్రభుత్వాలు అందరూ బడికి వెళ్లాలి.. అందరూ చదువుకోవాలి అని ప్రకటనలు చేస్తోంది. మన దేశం పేరు.. దేశ ప్రధాని పేరే చెప్పలేని విద్యార్థులు ఇంకా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారంటే అది దేనికి నిదర్శనమో పాలకులే చెప్పాలి. విద్యా వ్యవస్థను మెరుగు పర్చేందుకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నామని చెపుతుంది. అయినా దేశానికి సంబంధించిన కనీస సమాచారం కూడా పిల్లలకు తెలియలేదంటే.. మన విద్యావ్యవస్థ ఎలా ఉందో కళ్లకు కట్టినట్టు కనపడుతుంది. ఇకనైనా పాలకులు విద్యార్థులను తీర్చి దిద్దుతామని చెప్పడం ప్రకటనలకే పరిమితం కాకుండా.. కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించాలి.

