బిహార్లో ఓటర్ల జాబితా సవరణకు ఓకే..ఈసీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

బిహార్లో ఓటర్ల జాబితా సవరణకు ఓకే..ఈసీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
  • రాజ్యాంగం ప్రకారమే ఈ ప్రక్రియ కొనసాగుతోంది 
  • అయితే, ఎన్నికల టైంలో సవరణలపైనే డౌట్లొస్తున్నయ్ 
  • ఓటర్ల రీవెరిఫికేషన్ కు ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డును పరిశీలించాలని ఆదేశం 


న్యూఢిల్లీ: బిహార్ లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో రాజ్యాంగం ప్రకారమే ఎన్నికల సంఘం పనిచేస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగించవచ్చని, అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇలాంటి ప్రయోగాలు చేపట్టడం సరికాదని పేర్కొంది. బిహార్  అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రంలో స్పెషల్  ఇంటెన్సివ్  రివిజన్ (ఎస్ఐఆర్) చేపట్టాలని చూస్తున్న ఎన్నికల సంఘం నిర్ణయంపై సుప్రీంకోర్టు పలు సందేహాలు లేవనెత్తింది. 8 కోట్ల జనాభా ఉన్న బిహార్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోపు ఈ ప్రక్రియ పూర్తవుతుందా అని ఈసీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 

రాష్ట్ర ఎన్నికల జాబితాకు సంబంధించిన ఎస్ఐఆర్ పై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. ఓటరు రీవెరిఫికేషన్  కోసం ఈసీ పరిశీలించాలనుకుంటున్న 11 డాక్యుమెంట్లలో ఆధార్, ఓటర్  ఐడీ, రేషన్  కార్డులు లేకపోవడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓటర్ల గుర్తింపును రీవెరిఫై చేసేందుకు ఆ మూడు గుర్తింపు కార్డులను కూడా పరిశీలించాలని ఈసీని సుప్రీంకోర్టు జస్టిస్  సుధాన్షు ధూలియా, జస్టిస్  జోయ్ మాలా బాగ్చీతో కూడిన బెంచ్  గురువారం ఆదేశించింది.

 అసెంబ్లీ ఎన్నికల్లోపే ఓటర్  రీవెరిఫికేషన్  కోసం ఆ మూడు కార్డులను పరిశీలిస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. ఆ మూడు గుర్తింపు కార్డులు లేవన్న సాకుతో ఓటరును ఓటరు లిస్టు నుంచి మినహాయిస్తే, అసెంబ్లీ ఎన్నికల్లోపు చాలెంజ్  చేయడానికి ఓటరుకు టైం ఉండదని పేర్కొంది. ఈ మేరకు ఈసీ తరపు అడ్వొకేట్ రాకేశ్  ద్వివేదీని బెంచ్  ఆదేశించింది. 

ఆధార్ ను ఎందుకు చేర్చరు?

ఓటరు రీవెరిఫికేష్  కోసం ఆధార్  కార్డును ఎందుకు చేర్చలేదని బెంచ్  ప్రశ్నించింది. పౌరసత్వానికి ఆధార్  కార్డు ప్రూఫ్  కాదని ద్వివేది జవాబు ఇవ్వగా.. పౌరసత్వాన్ని నిర్ణయించే బాధ్యత కేంద్ర హోం శాఖదని, ఈసీది కాదని బెంచ్  స్పష్టం చేసింది. కాగా.. ఎస్ఐఆర్ పై స్టే విధించాలని ద్వివేది కోరగా.. అందుకు బెంచ్  నిరాకరించింది. 

రీవెరిఫికేషన్ పై దాఖలైన్  పిటిషన్లపై ఈ నెల 21లోపు కౌంటర్  అఫిడవిట్  సమర్పించాలని ఈసీని  ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. కాగా.. బిహార్ లో ఓటరు రీవెరిఫికేషన్  ప్రక్రియపై అసోసియేషన్  ఫర్  డెమోక్రటిక్  రిఫామ్స్, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాతో పాటు పలు సంఘాలు, వ్యక్తులు అభ్యంతరం తెలుపుతూ అంతకుముందు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. 

వచ్చే ఏడాది బెంగాల్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఈసీ ఇలాంటి రీవెరిఫికేషన్  ప్రక్రియ చేపట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరుపక్షాల నుంచి వాదనలు విన్న బెంచ్.. ఈసీని పలు ప్రశ్నలు అడిగింది.

 ‘‘ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని ఏ సెక్షన్  ఇలాంటి ఓటరు రీవెరిఫికేషన్  ప్రక్రియకు అనుమతి ఇస్తుంది? స్పెషల్  ఇంటెన్సివ్  రివిజన్ చేపట్టేందుకు మీకు (ఈసీ) ఉన్న అధికారం ఏంటి? బిహార్  అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందే ఎందుకు ఇలాంటి ప్రక్రియ చేపట్టారు? రీవెరిఫికేషన్  ప్రకియను బిహార్  అసెంబ్లీ ఎన్నికలతో ఎందుకు ముడిపెట్టారు?” అని ఈసీని సుప్రీంకోర్టు బెంచ్  అడిగింది. కౌంటర్  వేసేందుకు ఈ నెల 28 వరకు గడువు ఇచ్చింది.

మహిళా ఓటర్ ఐడీ కార్డుపై సీఎం నితీశ్ ఫొటో!  

పాట్నా: ఆ మహిళా ఓటరు పేరు అభిలాష కుమారి (30). ఊరు బిహార్ లోని మేధాపుర. ఇటీవలే ఆమె   ఓటరు ఐడీ కార్డులో అడ్రెస్ ను సరిచేసుకుంది. అధికారులు అడ్రస్ ను సరిచేశారు కానీ మరో తప్పు చేశారు. మహిళా ఓటరు ప్లేస్ లో బిహార్  సీఎం నితీశ్  కుమార్  ఫొటో యాడ్  చేశారు.

 కొత్త కార్డు అందుకున్న అభిలాష షాక్  అయింది. ‘‘ఓటరు ఐడీ కార్డులో కరెక్షన్  కోసం అప్లై చేసుకుంటే, నా ఫొటో ప్లేస్ లో సీఎం నితీశ్ ఫొటో ఉంది” అని అభిలాష వాపోయింది. దీంతో అధికారుల తీరుపై ఆమె భర్త చందన్  కుమార్  ఫైర్  అయ్యాడు. ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని, ఎంక్వయిరీ చేసి ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని చందన్  డిమాండ్  చేశాడు.