వెనకకు ముందుకు కనిపించే స్పెషల్ గ్లాసెస్

వెనకకు ముందుకు కనిపించే స్పెషల్ గ్లాసెస్

సైకిల్​పై వెళ్లేటప్పుడు.. వెనక నుంచి వచ్చే వాహనాలను చూడాలంటే.. తల వెనకకు తిప్పాల్సిందే. మామూలుగా సైకిల్ పై వెళ్లేటోళ్లకు ఇది కష్టమేమీ కాదు. కానీ సైక్లింగ్ చేసేటోళ్లకు చాలా కష్టమైన పని. వాళ్లట్ల తల వెనకకు తిప్పి చూసినప్పుడు.. ఏకాగ్రత దెబ్బతినడంతో పాటు వేగం తగ్గిపోతుంది. దీంతో రేసులో వెనకబడి పోవాల్సి వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగానే ఎన్కకూ చూడ్డానికి వీలుగా కళ్లఅద్దాలను తయారు చేసిన్రు ఇద్దరు. వాటికి ‘‘బిహైండ్ ది గ్లాసెస్” అని పేరు పెట్టిన్రు.

ధర రూ.20 వేల నుంచి..

స్కాట్లాండ్ లోని ఎడిన్ బర్గ్ కు చెందిన సైక్లిస్ట్ కల్లమ్ స్కిన్నర్, ఫిజిసిస్ట్ అలెక్స్ మ్యాక్ డొనాల్డ్ ఈ అద్దాలను డెవలప్ చేశారు. వీటి తయారీ కోసం కిక్ స్టార్టర్ క్యాంపెయిన్ ద్వారా రూ.కోటి సేకరించారు. ఈ డబ్బులతో ‘‘హైండ్ సైట్” అనే కంపెనీ పెట్టి అద్దాలను తయారు చేస్తున్నారు. గ్లాసెస్ ను రెండు భాగాలుగా విభజించి, సెమీ ట్రాన్స్ పరెంట్ అద్దాలతో వీటిని తయారు చేస్తున్నట్లు హైండ్ సైట్ టీమ్ తెలిపింది. గ్లాసెస్ లో ఒక సైడ్ నుంచి ముందున్నవి, మరో సైడ్ నుంచి వెనకున్నవి కనిపించేలా రూపొందిస్తున్నట్లు చెప్పింది. సైక్లిస్టులకు ఈ గ్లాసెస్ ఎంతగానో ఉపయోగపడతాయని.. తల ఎటూ తిప్పకుండా వీటితోనే ముందుకు, వెనకకు చూడొచ్చని పేర్కొంది. ఇందుకోసం కేవలం ఫోకస్ ను షిఫ్టు చేసుకుంటే సరిపోతుందని, దీనివల్ల సైక్లిస్టుల స్పీడ్ మెరుగవుతుందని వివరించింది. ఈ గ్లాసెస్ ప్రారంభ ధర రూ.20 వేలు ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

ఐడియా అట్లొచ్చింది…  

స్కిన్నర్ 2016 సమ్మర్ ఒలింపిక్స్ లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ గెలుచుకున్నాడు. ‘‘ఒక సైక్లిస్టుగా రోడ్ సేఫ్టీ ప్రాధాన్యమేంటో నాకు తెలుసు. దీంతో పాటు సైక్లిస్టులకు అవసరమయ్యే అద్దాలకు సంబంధించి భవిష్యత్తులో తీవ్రమైన పోటీ ఉంటుందని గుర్తించి వీటిని తయారు చేశాను. వెనక నుంచి ఏం వస్తున్నాయో తెలుసుకోవాలంటే.. సైక్లిస్టు తప్పనిసరిగా వెనకకు తిరిగి చూడాలి. అలాంటి టైమ్ లో సైక్లిస్టు తన సామర్థ్యాన్ని కోల్పోతాడు. పనితీరు దెబ్బతింటుంది. స్పీడ్ తగ్గిపోతుంది. ఈ సమస్యలన్నింటికీ హైండ్ సైట్ గ్లాసెస్ సమాధానంగా నిలుస్తాయి”  అని స్కిన్నర్ చెప్పారు. సైక్లిస్టులకు అద్దాల్లోనే వెనక నుంచి వచ్చే వాహనాలు కనిపిస్తే, త్వరగా డెసిషన్ తీసుకోవడానికి వీలుంటుందని మ్యాక్ డొనాల్డ్ అన్నారు.