తెలుగు భాష మీదున్న ఇష్టంతో పద్యాలు రాస్తోంది

తెలుగు భాష మీదున్న ఇష్టంతో పద్యాలు రాస్తోంది

శ్లోకాలు, పద్యాలు చదవాలంటే చాలామందికి  నోరు తిరగదు. ఇక ఏ భాషలోనైనా శ్లోకాలు, పద్యాలు రాయాలంటే ఆ భాష మీద పట్టు ఉండాలి. కవితలు బాగా చదవాలి. కానీ, ఈ అమ్మాయి స్కూల్లో చదువుకునే రోజుల్లో పద్యాలు గడగడా  అప్పజెప్పేది. ఆ తర్వాత పద్యాలు రాయడం మొదలుపెట్టింది. తెలుగు భాష మీద ఉన్న ఇష్టంతో సామాజిక అంశాలు, ఆధ్యాత్మికత విషయాల మీద పద్యాలు రాస్తోంది.  పేరు బెజ్జుగాం శ్రీజ.  సొంతూరు సిద్దిపేట జిల్లా నారాయణ్​రావుపేట మండలం లోని గుర్రాలగొంది.  ప్రస్తుతం బాసర ట్రిపుల్ ఐటీలో బీటెక్ సెకండియర్ చదువుతోంది.  

గుర్రాలగొందికి చెందిన బెజ్జుగాం నర్సవ్వ, వెంకటేశం దంపతులకు ముగ్గురు కూతుళ్లు. కూలి పనులకు వెళ్తూనే ముగ్గురిని చదివించేవాళ్లు. చిన్న కూతురు శ్రీజ చిన్నప్పటి నుంచి చదువుల్లో ఫస్ట్. పదో క్లాస్ వరకు సొంతూరులోని గవర్నమెంట్​ స్కూల్లో చదివింది. ఆమెకు తెలుగు సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. కారణం.. తెలుగు టీచర్ వరికోలు లక్ష్మయ్య పద్యాల్ని రాగయుక్తంగా ఆలపిస్తూ, వాటి అర్థం వివరించడమే. వచన కవిత్వం, కథలు, వ్యాకరణం వంటివి చక్కగా, తొందరగా అర్థమయ్యేలా చెప్పేవారు. ఆయన్ను చూసి తెలుగులో పద్యాలు రాయడం మొదలుపెట్టింది శ్రీజ.  పద్యంలో ఛందస్సు, ప్రాస, ముగింపు ఎలా ఉండాలి? వంటి విషయాలు నేర్పించి ఆమెని ప్రోత్సహించారు లక్ష్మయ్య. దాంతో ఆటవెలది, కంద, తేటగీతి పద్యాలు రాయడంలో పట్టు సాధించింది.  టెన్త్​ క్లాస్​ పూర్తయ్యేసరికి 150కి పైగా పద్యాలు రాసింది శ్రీజ. 

సామాజిక బాధ్యతతో....

టెన్త్​ క్లాస్​లో మంచి మార్కులు రావడంతో శ్రీజకు  బాసర ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది.  ప్రస్తుతం బీటెక్​​ సెకండ్​ ఇయర్​ చదువుతోంది. చదివేది ఇంజనీరింగ్​ అయినా  తెలుగు పద్యాలు రాయడం మాత్రం ఆపలేదు. ఇప్పటివరకూ 216 పద్యాలు రాసింది. వాటన్నింటినీ  ‘ శ్రీజపద్యలహరి ద్విశతి’ పేరుతో పుస్తకంగా అచ్చు వేయాలనుకుంది శ్రీజ. కానీ, ప్రింటింగ్​కు అవసరమైన డబ్బులు లేవు. ఆ విషయం తెలిసి వాళ్ల ఊరి సర్పంచ్ ఆంజనేయులు​  డబ్బు సాయం చేయడంతో500 కాపీలు ప్రింట్​ చేయించింది. శ్రీజ రాసిన పద్యాలు సామాజిక బాధ్యతని గుర్తు చేయడమే కాకుండా ఆధ్యాత్మికతని పెంచేలా ఉంటాయి. అందుకనే మొదటి పుస్తకంతోనే  జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ‘బాలసాహిత్య పురస్కారం’ అందుకుంది శ్రీజ. 

‘‘చేత గొడ్డలిగొని చెట్లను నరికిన
ముప్పు పొందగలదు ముందుతరము
ప్రాణ వాయువు కరువు ప్రజలకు నష్టము మొక్కలెన్నొనాటు మక్కువగును” అనే పద్యంలో చెట్లను నరకొద్దని, పచ్చదనం పెంచాలని  చెప్పింది శ్రీజ.

ఇంకా పద్యాలు రాస్తా

చిన్నప్పటి నుంచి పద్యాలు రాయాలని బాగా ఇంట్రెస్ట్​. కారణం...  శ్రీశ్రీ రచనలు బాగా చదివేదాన్ని.  నేను పద్యాలు రాయగలనని గుర్తించిన లక్ష్మయ్య టీచర్​ అండగా ఉండడంతో ఇప్పటికీ పద్యాలు రాస్తున్నా. స్కూల్​ డేస్​ నుంచి ఎక్కడ పద్య రచన పోటీలు జరిగినా పొల్గొని, ప్రైజ్​లు గెలిచేదాన్ని. ఇక ముందు కూడా పద్యాలు రాస్తా. కవయిత్రిగా పేరు తెచ్చుకోవాలనేది నా కోరిక. 

- శ్రీజ

 

::: బీ. బాజేంధర్​, భైంసా, వెలుగు