ఆందోల్​లో గెలిచిన పార్టీదే అధికారం

ఆందోల్​లో గెలిచిన పార్టీదే అధికారం

సంగారెడ్డి, వెలుగు : ఆందోల్​ సెంటిమెంట్​ ఈ సారి కూడా నిజమైంది. సంగారెడ్డి జిల్లా ఆందోల్​ అసెంబ్లీ సెగ్మెంట్​లో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న నమ్మకం మళ్లీ నిరూపణ అయింది. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు గెలుపొందిన పార్టీల అభ్యర్థులు ఉన్నత పదవులు పొందడమే కాకుండా రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రావడం ఆనవాయితీగా వస్తోంది.

ఉమ్మడి రాష్ట్రంలో నుంచి వస్తున్న ఈ సెంటిమెంట్​ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా కొనసాగుతోంది. ఇక్కడి నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు రాష్ట్రంలో మంత్రులుగా రాణించారు. జిల్లాలోనే 9 మండలాలతో అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్న ఆందోల్​ ఈ సారి కూడా సెంటిమెంట్​ పనిచేసింది. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన రాజనర్సింహా మంత్రిగా పనిచేయగా ఆయన తనయుడు దామోదర్​ కూడా మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా పదవులు పొందారు.

ఇదే నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన బాబూమోహన్​ మంత్రిగా రాణించి నియోజకవర్గానికి గుర్తింపు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆందోల్​ ఎమ్మెల్యేగా గెలుపొందిన  దామోదర్​ కాంగ్రెస్​ ప్రభుత్వంలో ఉన్నత పదవి అధిరోహిస్తారని ప్రచారం జరుగుతోంది. 

అందోల్ ప్రజలకు రుణపడి ఉంటా 

మునిపల్లి:  అందోల్‌ ప్రజలంతా  కాంగ్రెస్ వైపే ఉన్నారని, అందుకే తనను ఆశీర్వదించి ఆదరించారని ఎమ్మెల్యే దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు. ఆదివారం ఆయన గెలిచిన తర్వాత  అంతారం జీవన్ముక విఠలేశ్వర ఆలయంలో పూజలు చేశారు. దామోదర రాజనర్సింహా 28, 329 ఓట్ల మెజార్టీతో  గెలుపొందారు. ఆయన వెంట సతీమణి పద్మిని, కూతురు త్రిష దామోదర్,  మాజీ ఎంపీపీలు రాంరెడ్డి , రాజేశ్వర్ రావు,  మాజీ జడ్పీటీసీలు అసద్ పటేల్, అంజయ్య,  కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సతీశ్,  ఎంపీటీసీ పాండు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజు, రసూల్ పటేల్, మనోహర్, రహీం పాల్గొన్నారు.