టెస్ట్ క్రికెట్‌‎లో స్టోక్స్ హిస్టరీ.. ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలోనే ఒకే ఒక్క ప్లేయర్‎గా అరుదైన రికార్డ్

టెస్ట్ క్రికెట్‌‎లో స్టోక్స్ హిస్టరీ.. ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలోనే ఒకే ఒక్క ప్లేయర్‎గా అరుదైన రికార్డ్

బ్రిటన్: ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రెడ్ బాల్ ఫార్మాట్లో అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 7 వేల పరుగులు, 200 వికెట్ల తీసిన మూడవ ఆల్ రౌండర్‌గా రికార్డ్ సృష్టించాడు. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌ స్టేడియంలో భారత్‌తో జరుగుతోన్న నాల్గవ టెస్ట్‌లో ఈ రేర్ ఫీట్ నెలకొల్పాడు స్టోక్స్. తద్వారా క్రికెట్ లెజెండ్స్ సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్, జాక్వెస్ కల్లిస్ సరసన చేరాడు. స్టోక్స్ కంటే ముందు గార్‌ఫీల్డ్ సోబర్స్, జాక్వెస్ కల్లిస్ మాత్రమే టెస్టుల్లో 7 వేల పరుగులు, 200 వందల వికెట్ల మైలురాయిని సాధించారు. మాంచెస్టర్ టెస్టులో అద్భుత సెంచరీతో చెలరేగిన స్టోక్స్ దిగ్గజాల జాబితాలో తన పేరు లిఖించుకున్నాడు.

అంతేకాకుండా టెస్టుల్లో 200కు పైగా వికెట్లు తీయడంతో పాటు 7000కు పైగా పరుగులు సాధించిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్‎గా కూడా స్టోక్స్ నయా రికార్డ్ నెలకొల్పాడు. కాగా, మాంచెస్టర్ టెస్టులో బెన్ స్టోక్స్ ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన విషయం తెలిసిందే. తొలుత బౌలింగ్లో ఐదు వికెట్లు తీసి ఇండియా నడ్డివిరిచిన స్టోక్స్.. ఆ తర్వాత బ్యాటింగ్‎లోనూ చెలరేగి ఆడాడు. భారత బౌలర్లనుఉతికారేస్తూ సూపర్ సెంచరీ (141) చేశాడు స్టోక్స్. బౌలింగ్, బ్యాటింగ్లో స్టోక్స్ కెప్టెన్ ఇన్సింగ్స్ ప్రదర్శించడంతో మాంచెస్టర్ టెస్టులో ఇంగ్లాండ్ విజయం దాదాపు ఖరారైంది. 

కాగా, మాంచెస్టర్ వేదికగా ఓల్డ్ ట్రాఫోర్డ్‎లో జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‎లో భారత్ 354 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. అనంతరం భారత బౌలర్లు విఫలం కావడంతో ఫస్ట్ ఇన్సింగ్స్‎లో ఇంగ్లాండ్‎ 669 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో అతిథ్య జట్టుకు 311 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆదిలోనే కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది.

ఖాతా తెరవకుండానే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. అద్భుతమైన బౌలింగ్ తో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్, సాయి సుదర్శన్‎ను పెవిలియన్ కు పంపించాడు క్రిస్ వోక్స్. దీంతో ఇండియా పీకల్లోతూ కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ 13, శుభమన్ గిల్ 26 ఉన్నారు. అద్భుతం జరిగితే తప్ప ఈ టెస్టులో ఓటమి నుంచి టీమిండియా బయటపడటం కష్టమే.