ధోనీ..గెలిపించాలని ఆడలేదు

ధోనీ..గెలిపించాలని ఆడలేదు

న్యూఢిల్లీ:  లాస్ట్‌‌ ఇయర్‌‌ వరల్డ్‌‌ కప్‌‌ సందర్భంగా తమ జట్టుతో జరిగిన మ్యాచ్‌‌లో ఇండియా టార్గెట్‌‌ ఛేజింగ్‌‌ స్ట్రాటజీ తనకు చికాకు తెప్పించిందని ఇంగ్లండ్‌‌ స్టార్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ బెన్‌‌ స్టోక్స్‌‌ అంటున్నాడు. విరాట్‌‌ కోహ్లీ, రోహిత్‌‌ శర్మ ఆడిన విధానం వింతగా అనిపించిందని, ధోనీ బ్యాటింగ్‌‌ చూస్తే జట్టును గెలిపించాలన్న ఉద్దేశమే కనిపించలేదని చెప్పాడు. బర్మింగ్‌‌హామ్‌‌లో జరిగిన ఆ మ్యాచ్‌‌లో ఫస్ట్‌‌ ఇంగ్లండ్‌‌ 337/7  స్కోరు చేయగా.. భారీ ఛేజింగ్‌‌లో తడబడిన కోహ్లీసేన 31 రన్స్‌‌ తేడాతో ఓడిపోయింది. వరల్డ్‌‌కప్‌‌లో ఇంగ్లండ్ ఆడిన అన్ని మ్యాచ్‌‌ల గురించి స్టోక్స్‌‌ తన కొత్త బుక్‌‌ ‘ఆన్‌‌ ఫైర్‌‌’లో  అనలైజ్‌‌ చేశాడు. ఈ క్రమంలో ఇండియాతో పోరు గురించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘11 ఓవర్లలో ఇండియాకు 112 రన్స్‌‌ అవసరమైన టైమ్‌‌లో క్రీజులోకి వచ్చిన ధోనీ ఆటతీరు ఆశ్చర్యం కలిగించింది. అతను సిక్సర్ల కంటే సింగిల్స్‌‌కే ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపించింది. ఆ  సిచ్యువేషన్‌‌లో మరో డజను బాల్స్‌‌ మిగిలుండగానే ఇండియాకు గెలుపు అవకాశాలు ఉన్నాయి. కానీ, ధోనీ , అతని పార్ట్‌‌నర్‌‌ కేదార్‌‌ జాదవ్‌‌ బ్యాటింగ్‌‌లో గెలవాలన్న ఉద్దేశమే కనిపించలేదు. విజయం ఇంకా సాధ్యమే అనిపించినప్పుడు నేనైతే కచ్చితంగా ఎదురుదాడికి దిగుతా’ అని తన పుస్తకంలో స్టోక్స్‌‌ రాసుకొచ్చాడు.

ఇక,  ఈ మ్యాచ్‌‌లో ఇంగ్లండ్‌‌ పేసర్లు క్రిస్‌‌ వోక్స్‌‌, జొఫ్రా ఆర్చర్‌‌…  రోహిత్‌‌, కోహ్లీకి సవాల్‌‌ విసిరారు. ఈ ఇద్దరూ 138 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ చేసినా ఏకంగా 27 ఓవర్లు ఎదుర్కొన్నారు. దాంతో, ఈ ఇద్దరి బ్యాటింగ్‌‌ అప్రోచ్‌‌ బాగాలేదని స్టోక్స్‌‌ అభిప్రాయపడ్డాడు. ‘రోహిత్‌‌, కోహ్లీ ఆడిన విధానం నాకు అస్సలు అర్థం కాలేదు. ఆ టైమ్‌‌లో మేం బాగా బౌలింగ్‌‌ చేశామని తెలుసు. కానీ, వీరిద్దరి బ్యాటింగ్‌‌ వింతగా అనిపించింది. వాళ్లు తమ జట్టును చేజేతులా మ్యాచ్‌‌కు దూరం చేశారు. మా టీమ్‌‌పై ఒత్తిడి పెంచలేకపోయారు.  పైగా నింపాదిగా ఆడి  మ్యాచ్‌‌ను మా చేతుల్లో పెట్టేశారు’ అని స్టోక్స్‌‌ పేర్కొన్నాడు. ఇక, మ్యాచ్‌‌ అనంతరం గ్రౌండ్‌‌ బౌండ్రీ లైన్​ సైజుపై  కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఒకవైపు బౌండ్రీ దూరం 82 మీటర్లు ఉంటే.. ఇంకోవైపు 59 మీటర్ల ఉందన్నాడు. ఆ సైడ్‌‌లో రివర్స్‌‌ స్వీప్‌‌ షాట్‌‌ ఆడితే సులువుగా సిక్సర్‌‌ వస్తుందన్నాడు. అయితే, ఈ కామెంట్లు కూడా తనకు వింతగా అనిపించాయని స్టోక్స్‌‌ అన్నాడు. అలాంటి  చెత్త ఫిర్యాదును తానెప్పుడూ వినలేదని పేర్కొన్నాడు.

 

ఇండియాతో  పింక్ వార్ కు వెయిటింగ్