డబుల్ బెడ్రూమ్స్ ఆక్రమించుకున్న లబ్దిదారులు

డబుల్ బెడ్రూమ్స్ ఆక్రమించుకున్న లబ్దిదారులు

జగిత్యాల: తమకు అలాట్ అయిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఇప్పటికీ ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు వాటిని ఆక్రమించుకున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. మల్యాల మండలం నూకపెల్లిలో కొంతమంది గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. అయితే వీరికి ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను కొంతకాలం కిందట అలాట్ చేశారు. కానీ ఇప్పటివరకు వాటిని హ్యాండ్ ఓవర్ చేయకపోవడంతో లబ్ధిదారులు తాళాలు పగులగొట్టి మరీ గృహప్రవేశాలు చేశారు. ఎలాంటి ప్రారంభోత్సవాలు లేకుండా.. హంగూఆర్భాటాలు లేకుండా కొత్త ఇండ్లలోకి వెళ్లి పాలు పొంగించారు. 

గత దసరా సమయంలోనే కొత్త ఇండ్లలోకి వెళ్లొచ్చని ఎమ్మెల్యే చెప్పారని... కానీ ఇప్పటివరకూ ఎటువంటి స్పందన లేదని లబ్ధిదారులు వాపోయారు. గుడిసెలు వేసుకుని జీవిస్తున్న తాము.. విషపురుగులు, పాములతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. వర్షాకాలం మొదలుకావడంతో తమ ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయని వారన్నారు. ఎవరొచ్చినా తాము ఆక్రమించుకున్న డబుల్ బెడ్రూం ఇళ్లు ఖాళీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మొత్తం 19 కుటుంబాలు.. 19 డబుల్ బెడ్రూం ఇళ్ల తాళాలు పగులగొట్టి మరీ వాటిని ఆక్రమించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.