హుజూరాబాద్ ​జనాలకే కార్డులు.. పింఛన్లు!

హుజూరాబాద్ ​జనాలకే కార్డులు.. పింఛన్లు!
  • మీ సేవా కేంద్రాల్లో అప్లికేషన్ల స్వీకరణ
  • రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల ప్రజలకు దక్కని అవకాశం
  • మేమేం అన్యాయం చేశామని ప్రశ్నిస్తున్న జనం
  • ఎమ్మెల్యేలంతా ఏం చేస్తున్నారని మండిపాటు

జయశంకర్‌‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం గ్రామానికి చెందిన రాయం రమేశ్, -లావణ్య 2018లో పెండ్లి చేసుకున్నారు. అనంతరం కొత్త రేషన్ కార్డు కోసం మీ సేవాలో అప్లయ్‌‌ చేసుకున్నారు. ఇది జరిగి రెండేండ్లు దాటింది. వీళ్లకు ఒక పాప కూడా పుట్టింది. జులైలో స్టేట్‌‌ గవర్నమెంట్‌‌ చేపట్టిన న్యూ రేషన్ కార్డ్స్‌‌ పంపిణీలో వీళ్లకు కార్డు  మంజూరు చేయలేదు. ఇప్పుడు మళ్లీ కొత్తగా అప్లయ్‌‌ చేసుకుందామంటే మీ సేవా సెంటర్‌‌లో న్యూ రేషన్‌‌ కార్డ్స్‌‌ అప్లయ్‌‌ చేసుకునే ఆప్షన్‌‌ ఇవ్వలేదని నిర్వాహకులు చెబుతున్నారు.

భూపాలపల్లి జిల్లా మల్హర్‌‌ మండలం కొయ్యూరు గ్రామానికి చెందిన బత్తుల తిరుమల, రవీందర్‌‌ దంపతులకు 2019 జూన్ 20న వివాహం జరిగింది. కొత్త రేషన్‌‌ కార్డులు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్‌‌ ఈ ఏడాది జులైలో ప్రకటించారు. ఆ సాయంత్రమే వెబ్‌‌సైట్‌‌ క్లోజ్‌‌ చేయడంతో అప్లై చేయలేకపోయారు. ఇప్పుడు మళ్లీ కొత్త రేషన్‌‌ కార్డుల కోసం అప్లికేషన్లు తీసుకుంటున్నారని  తెలిసి మీ సేవా సెంటర్‌‌కు వెళ్లారు. అయితే వెబ్ సైట్ పోర్టల్​లో ‘అప్లికేషన్ ఫర్ న్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ సర్వీస్ ఈజ్ నాట్ అవైలబుల్’ అని చూపిస్తుండడంతో ఇప్పుడూ దరఖాస్తు చేయలేకపోయారు. 

కరీంనగర్/జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: కరీంనగర్​జిల్లా హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు నియోజకవర్గ ప్రజలకు పథకాలను   తెచ్చిపెడుతున్నాయి. కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకునేందుకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేవలం నియోజకవర్గంలోనే సైట్ ఓపెన్ అవుతోంది. ఇప్పటికే చాలామంది కొత్త కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. ఇక ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కొత్త పింఛన్లకు సైతం దరఖాస్తులు తీసుకుంటున్నారు. కొత్త రూల్స్​ప్రకారం 57 ఏండ్లు నిండితే చాలు.. వారంతా పింఛన్ కోసం దరఖాస్తు  చేస్తున్నారు. వీటితో పాటు కొత్తగా అప్లై చేసుకోవడానికి వికలాంగులకు సదరం క్యాంపు కూడా నిర్వహిస్తున్నారు. ఇలా అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయి. 
5 మండలాల ప్రజలకే..
రాష్ట్రంలో రేషన్​కార్డుల కోసం లక్షలాది మంది ప్రజలు ఏండ్లుగా ఎదురు చూస్తున్నారు. అయితే సర్కారు మాత్రం కొత్తగా అప్లయ్‌‌ చేసుకునే అవకాశాన్ని కేవలం హుజూరాబాద్‌‌ అసెంబ్లీ నియోజకవర్గం వరకే పరిమితం చేసింది. కొత్త రేషన్‌‌ కార్డుల కోసం మీ సేవా సెంటర్లలో ఆన్‌‌లైన్‌‌ ద్వారా అప్లై చేసుకోవాలి. ఈ అప్లికేషన్‌‌ నేరుగా సంబంధిత తహసీల్దార్‌‌ ఆఫీసుకు చేరుతుంది. తహసీల్దార్‌‌ ఆదేశాలతో వీఆర్వోలు లేదా రెవెన్యూ ఇన్‌‌స్పెక్టర్లు ఎంక్వైరీ చేసి రిపోర్ట్‌‌ ఇస్తారు. ఈ రిపోర్ట్‌‌ ఆధారంగా తహసీల్దార్‌‌ లాగిన్‌‌లో ఓకే చేస్తే జిల్లా సివిల్‌‌ సప్లయ్‌‌ అధికారి(డీఎస్‌‌వో) లాగిన్‌‌కు వెళతాయి. అక్కడ డీఎస్‌‌వో కూడా ఓకే చేస్తే జిల్లాల వారీగా రిపోర్ట్‌‌ స్టేట్‌‌ గవర్నమెంట్‌‌ దగ్గరికి వెళుతుంది. గవర్నమెంట్‌‌ ఆదేశాల మేరకు కొత్త రేషన్‌‌ కార్డులు మంజూరవుతాయి. ఇలా గడిచిన ఏడేళ్లుగా కొత్త రేషన్‌‌ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారిలో రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షలకు పైగా ‌కార్డులను ఇటీవల పంపిణీ చేశారు. ఇంకా కార్డులు అందనివారు లక్షల్లో ఉన్నారు. ప్రస్తుతం కేవలం హుజూరాబాద్‌‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 5 మండలాల ప్రజల నుంచి మాత్రమే అప్లికేషన్లు తీసుకుంటున్నారు. కొత్త రేషన్​కార్డుల కోసం అప్లికేషన్లు స్వీకరించే విధంగా ఇక్కడి మీ సేవా కేంద్రాలలో సివిల్‌‌ సప్లయ్‌‌ వెబ్‌‌సైట్‌‌ను మార్చారు. హుజూరాబాద్‌‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని హుజూరాబాద్‌‌, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్‌‌, ఇల్లంతకుంట మండలాల్లోని మీ సేవా సెంటర్లలో 5 రోజులుగా కొత్త రేషన్‌‌ కార్డుల అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు. ఇప్పటికే హుజూరాబాద్ లో 217, జమ్మికుంటలో 220, వీణవంకలో 323, ఇల్లందకుంటలో 70, కమలాపూర్ లో 315 దరఖాస్తులు అందాయి. 
పింఛన్ల కోసం సదరం క్యాంపు
రేషన్  కార్డులే కాదు  కొత్త పింఛన్ల దరఖాస్తులు కూడా హుజూరాబాద్​ నియోజకవర్గ ప్రజల నుంచి తీసుకుంటున్నారు. ఆసరా పింఛన్ల కోసం వయస్సును 57 సంవత్సరాలకు తగ్గించడంతో చాలామంది దరఖాస్తు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో  సుమారు11వేల మందికి కొత్త పింఛన్లు అందే అవకాశముంది. వికలాంగులకు మాత్రం కొత్త సదరం క్యాంపు సర్టిఫికెట్ ఉంటేనే పింఛన్లు మంజూరు చేస్తారు. ఇందుకోసం గురువారం హుజూరాబాద్ లో స్పెషల్ గా సదరం క్యాంపు  నిర్వహించారు. చాలారోజుల తరువాత క్యాంపు పెట్టడంతో చుట్టుపక్కల ఉన్న  మండలాల నుంచి సైతం వికలాంగులు తరలివచ్చారు. కానీ హుజూరాబాద్ నియోజకవర్గం వారినే ఇక్కడ అనుమతించి పరీక్షించారు. మిగిలిన వారిని వెనక్కి పంపించారు. క్యాంపు హుజూరాబాద్ వాళ్ల కోసమే పెట్టారా.. అంటూ అక్కడికి వచ్చిన వికలాంగులు నిరాశతో వెనుతిరిగారు. 
నోటిఫికేషన్​ వస్తుందని చకచకా పనులు
ఉప ఎన్నికల నోటిఫికేషన్ మరో వారం, పది రోజుల్లో వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా పథకాలకు సంబంధించిన పనులన్నీ ఆఫీసర్లు చకచకా కానిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పింఛన్లు, కార్డులకు వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించాలని ఉన్నతాధికారులు మండల స్థాయి అధికారులను ఆదేశించినట్లు  తెలిసింది. అందుకే ఎక్కడా జాప్యం చేయడం లేదు. ముఖ్యంగా ఈ టైమ్ లో రాష్ట్రంలో ఎక్కడా సైట్ ఓపెన్ లేకున్నా.. హుజురాబాద్ నియోజకవర్గంలోనే ఓపెన్ చేసి రేషన్​కార్డులకు దరఖాస్తులు తీసుకోవడం విడ్డూరంగా ఉందని ఇతర నియోజకవర్గాల ప్రజలు అంటున్నారు. ఓట్ల కోసం సర్కారు చేస్తున్న జిమ్మిక్కులపై మండిపడుతున్నారు. ప్రస్తుతం హుజూరాబాద్​లో మాత్రమే సర్కారు అప్లికేషన్లు తీసుకుంటుంటే.. మిగిలిన 118 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.