సర్‌తో సీఏఏ అమలు చేస్తే.. బీజేపీ, ఈసీ కాళ్లు విరగ్గొడతా

సర్‌తో సీఏఏ అమలు చేస్తే.. బీజేపీ, ఈసీ కాళ్లు విరగ్గొడతా
  • బెంగాల్‌ మంత్రి ఫిర్హాద్ హకీమ్ వివాదాస్పద వ్యాఖ్యలు
  • తీవ్రంగా తప్పుపట్టిన బీజేపీ 

కోల్‌కతా: బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)పై పశ్చిమ బెంగాల్‌ మినిస్టర్ ఫిర్హాద్ హకీమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఈసీలు కలిసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)తో సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (సీఏఏ) అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అదే జరిగితే బీజేపీ నేతలు, ఈసీ అధికారుల కాళ్లు విరగ్గొడతానని ఫైర్ అయ్యారు.  ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై రాజకీయ పార్టీలకు వివరించడానికి బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అందులో బెంగాల్‌ మంత్రి ఫిర్హాద్ హకీమ్ పాల్గొన్నారు. మీటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. " బెంగాల్ లో ఒక్క నిజమైన ఓటరు పేరును ఓటర్ లిస్ట్ నుంచి తొలగించడానికి మేం అనుమతించం.

ఒక్క నిజమైన ఓటరు పేరును తొలగించినా సర్ ప్రాసెస్ ను వ్యతిరేకిస్తామని టీఎంసీ పార్టీ తరపున నేను స్పష్టం చేస్తున్నాను. జాబితా 100 శాతం న్యాయంగా, పారదర్శకంగా ఉండాలి. మమతా బెనర్జీ ఉన్నంత కాలం బెంగాల్ లో  నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ)ని బీజేపీ అమలు చేయలేదు" అని పేర్కొన్నారు. హకీమ్‌ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. రాజ్యాంగ సంస్థ అయిన ఈసీపై టీఎంసీ బహిరంగ బెదిరింపులకు పాల్పడిందని ఫైర్ అయ్యింది. హింసను ప్రేరేపించడంతో పాటు అక్రమ చొరబాటుదారులను రక్షించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఓటు బ్యాంకు కోసం టీఎంసీ హింసను ప్రోత్సహిస్తున్నదని పేర్కొంది.  ఇక హకీమ్‌ వ్యాఖ్యలపై ఈసీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.