AI సీఈవో సుచన కేసు : కొడుకు ముఖంపై దిండు పెట్టి.. ఊపిరి ఆడకుండా చంపేసింది

AI సీఈవో సుచన కేసు : కొడుకు ముఖంపై దిండు పెట్టి.. ఊపిరి ఆడకుండా చంపేసింది

బెంగళూర్ కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంపెనీ సీఈవో సుచనా సేత్  తన నాలుగేండ్ల కొడుకును గోవాలో కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే.  ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు.. బాలుడి శవాన్ని పోస్ట్‌మార్టానికి పంపించారు.  పోస్ట్‌మార్టం రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.  బాలుడిని ముఖంపై దిండు లేదా టవల్ లాంటిది పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసిందని డాక్టర్ కుమార్ నాయక్ రిపోర్టులో వెల్లడించారు. అంతేకాకుండా ఆ బాలుడు చనిపోయి దాదాపుగా 36 గంటలు అయి ఉంటుందని ఆయన అంచానా వేశారు.  బాలుడి శరీరంపై ఎలాంటి  గాయలు లేవని చెప్పారు.  

బెంగళూర్​కు చెందిన సుచనా సేత్.. మైండ్ ఫుల్ ఏఐ ల్యాబ్ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించారు. ఆమె తన నాలుగేండ్ల కొడుకుతో ఈ నెల 6న గోవా టూర్ కు వెళ్లారు. నార్త్ గోవాలోని కండోలిమ్ లో రెంటెడ్ అపార్ట్ మెంట్​లో రూమ్ తీసుకున్నారు. రెండ్రోజులు ఉన్నాక.. బెంగళూర్​ వెళ్లేందుకు  ట్యాక్సీ అరెంజ్ చేయాలని అపార్ట్ మెంట్ సిబ్బందిని కోరారు. వాళ్లు ఏర్పాటుచేసిన ట్యాక్సీలో  సోమవారం తెల్లవారుజామున సుచన బెంగళూర్​కు బయలుదేరారు.   సుచన రూమ్ ఖాళీ చేసి వెళ్లిపోవడంతో, దాన్ని క్లీన్ చేసేందుకు అపార్ట్ మెంట్ సిబ్బంది వెళ్లారు. అక్కడ టవల్​పై రక్తపు మరకలు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.  పోలీసులు ఆమెను చిత్రపురి పోలీస్ స్టేషన్ లో పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సుచనను  కోర్టులో ప్రవేశపెట్టగా, సుచనను 6 రోజుల కస్టడీకి అప్పగించింది.

భర్తతో గొడవలు..  

సుచన, ఆమె భర్త వేర్వేరుగా ఉంటున్నారని.. వాళ్ల విడాకుల ప్రక్రియ కొనసాగుతోందని నార్త్ గోవా ఎస్పీ నిధిన్ వాల్సన్ తెలిపారు. ‘‘సుచన సొంతూరు బెంగాల్. బెంగళూర్​లో ఉంటోంది. ఆమె భర్త వెంకటరమణది కేరళ. ఆయన ప్రస్తుతం ఇండోనేసియాలోని జకర్తాలో ఉన్నారు. ఈ ఘటన గురించి అతనికి సమాచారం అందించాం” అని చెప్పారు. వెంకటరమణ కర్నాటకకు వచ్చారని, పోస్టుమార్టం తర్వాత కొడుకు డెడ్ బాడీని ఆయనకు అప్పగించామని పేర్కొన్నారు. ‘‘సుచన తన కొడుకును ఎందుకు చంపిందో ఇంకా తెలియలేదు. ఆమెను విచారించాకే అన్ని విషయాలు తెలుస్తాయి. కొడుకును చంపిన తర్వాత సుచన ఆత్మహత్యాయత్నం చేసింది. ఎడమచేతి మణికట్టు దగ్గర కోసుకుంది. రూమ్​లో టవల్ పైనున్న రక్తపు మరకలు అవే” అని వివరించారు.