బెంగళూరులో రీసెంట్‌గా జరిగిన ఒక షాకింగ్ ఘటనలో, జల్సాల కోసం డబ్బులు తక్కువయ్యాయని నలుగురు కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళతో పాటే ఉండే ఒక హాస్టల్ ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేశారు. విషయం తెలిసిన వెంటనే మడివాళ పోలీసులు రంగంలోకి దిగి కేవలం కొన్ని గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. బీటీఎం లేఅవుట్‌లోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో జైన్ యూనివర్సిటీకి చెందిన రిషబ్ మొహంతి (19) అనే స్టూడెంట్ ఉంటున్నాడు. శనివారం సాయంత్రం నిందితులైన అతని ఫ్రెండ్స్ అతడిని మాటల్లో పెట్టి బయటకు రప్పించారు. ఆ తర్వాత బలవంతంగా కారులో ఎక్కించుకుని జయనగర్‌లోని ఒక ఇంటికి తీసుకెళ్లి బంధించారు. అక్కడ కత్తి, డమ్మీ పిస్టల్‌తో అతడిని భయపెట్టారు.
కిడ్నాపర్లుగా ఉన్న నిందితులు రిషబ్‌ను వదిలేయడానికి రూ. 50,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అతని ఫోన్ నుండే అతని ఫ్రెండ్స్‌కు కాల్స్ చేయించి డబ్బులు అడిగారు. భయంతో అతని ఫ్రెండ్స్ మొదటగా రూ. 10,000 యూపీఐ (UPI) ద్వారా పంపారు. తరువాత ఈ విషయంపై 112 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు అందగానే పోలీసులు అలర్ట్ అయ్యారు. నిందితులు ఇంత తక్కువ డబ్బు కోసం ఫోన్ కాల్స్ చేస్తూ, మొబైల్ ఆన్ లోనే ఉంచడంతో వారి లోకేషన్ ఈజీగా దొరికిపోయింది. పోలీసులు డిజిటల్ నెట్‌వర్క్ సాయంతో కారును కనిపెట్టి, వెంటనే రిషబ్‌ను కాపాడారు.
పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఆదిత్య భోసలే, శౌర్య అగర్వాల్, సయ్యద్ మహమ్మద్ బిలాల్, నికుంజ్ సుల్తానియా ఉన్నారు. వీరి వయస్సు 19 నుంచి 23 ఏళ్ల మధ్య ఉంటుంది. వీరు విలాసవంతమైన జీవితం గడపడానికి, ఈజీగా డబ్బు సంపాదించాలని ఈ ప్లాన్ వేశారు. కిడ్నాప్ కోసం నిందితుల్లో ఒకరు తన తండ్రి కారునే వాడగా... వీరిలో ఒకరికి పాత నేర చరిత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసులు నిందితుల దగ్గర నుంచి కిడ్నాప్‌కు వాడిన కారు, ఒక కత్తి, ఒక నకిలీ పిస్టల్‌ను స్వాధీనం చేసుకొని... కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
