పిల్లాజల్లా లేరు.. ఏడాదికి రూ.50 లక్షల జీతం చాలటం లేదంట వీళ్లకు..

పిల్లాజల్లా లేరు.. ఏడాదికి రూ.50 లక్షల జీతం చాలటం లేదంట వీళ్లకు..

బెంగళూరుకు చెందిన కంటెంట్ క్రియేటర్ కపుల్ ప్రకృతి అరోరా, ఆశిష్ కుమార్ తాము 2025లో చేసిన ఖర్చుల చిట్టాను బయటపెట్టి సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించారు. 2025 సంవత్సరానికి గానూ తాము ఏకంగా రూ.47 లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ భారీ మొత్తం విన్న నెటిజన్లు.. "మీరు మమ్మల్ని ఎన్ని రకాలుగా పేదవాళ్లని చేస్తారు బాబోయ్!" అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. డబ్బు గురించి చర్చించడం మొదట్లో తమకు ఇబ్బందిగా ఉండేదని, కానీ ఇలా ఆర్థిక సమీక్షలు చేసుకోవడం వల్ల భవిష్యత్తుపై భయం పోయిందని ఈ జంట చెబుతోంది.

అసలు ఈ జంట గడచిన ఏడాదిలో దేని కోసం ఎంత ఖర్చు చేశారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..ఈ జంట గతేడాది చేసిన అతిపెద్ద ఖర్చు ట్రావెల్ కోసమే. దీనిని గమనిస్తే వారు విమానాల్లోనే కాలం గడిపినట్లు కనిపిస్తోంది. ఏకంగా 63 విమాన ప్రయాణాలు చేసి, 6 ఖండాల్లోని 13 దేశాలను చుట్టేశారు. 121 రాత్రులు హోటళ్లు, ఎయిర్‌బిఎన్‌బిలలో గడిపారు. దీనికోసం వీరు ఖర్చు చేసింది అక్షరాలా రూ.29 లక్షలంట.

ఇకపోతే బెంగళూరులో ఒక అద్దె ఇంట్లో ఉంటున్న వీరు ఏడాదికి అద్దె కింద రూ.5 లక్షలు చెల్లించారు. ఇక తిండి, గ్రాసరీస్ కోసం రూ.2లక్షల 50వేలు ఖర్చు చేశారు. అలాగే ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపే ఈ జంట.. పర్సనల్ ట్రైనర్, పైలేట్స్ మెంబర్‌షిప్ కోసం లక్ష వెచ్చించారు. కంటెంట్ క్రియేటర్లు కావడంతో కొత్త ఎక్విప్‌మెంట్ కోసం రూ.2లక్షల 50వేలు, అలాగే షాపింగ్ విషయానికి వస్తే ఒకేలాంటి 'లవ్ బ్యాండ్స్' కోసం మరో రూ.4 లక్షలు ఖర్చు చేశామని చెప్పారు. ఇకపోతే ఇంటి పనివారు, మెయింటెనెన్స్, సబ్‌స్క్రిప్షన్ల కోసం రూ.లక్ష 50వేలు.. క్యాబ్‌లు, ఇతర పనుల కోసం రూ.లక్ష 30వేలు వెచ్చించారు.

ALSO READ : డీమార్ట్ ఓనర్ దమానీకి 2 నిమిషాల్లో రూ.162 కోట్లు లాస్..

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి రకరకాల స్పందనలు వస్తున్నాయి. మీరు నెలకింత ఖర్చు చేస్తున్నారంటే.. అసలు ఏం ఉద్యోగం చేస్తున్నారు? మాకు కూడా చెప్పండి అంటూ కొందరు అడుగుతుంటే.. మరికొందరు మీరు జీవితాన్ని పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారు, అభినందనలు అని కామెంట్ చేశారు. ఒక యూజర్ అయితే "ఇది నా జీవితకాల సంపాదన కన్నా ఎక్కువ" అంటూ తన ఆవేదనను సరదాగా పంచుకున్నారు.