రాధాకిషన్ దమానీ ఈ పేరు స్టాక్ మార్కెట్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దివంగత బిగ్ బుల్ రాకేష్ జున్‌జున్ వాలాకు ఈయనే గురువు. అందుకే ఈయన డీమార్ట్ కంపెనీ ప్రారంభించటానికి మునుపే చాలా ఫేమస్. ఈయన పెట్టుబడులను, పోర్ట్ ఫోలియోను చాలా మంది ఇప్పటికీ ఫాలో అవుతుంటారు.
దళాల్ స్ట్రీట్ దిగ్గజ ఇన్వెస్టర్ రాధాకిషన్ దమానీకి మంగళవారం భారీ షాక్ తగిలింది. టాటా గ్రూప్‌కు చెందిన రిటైల్ దిగ్గజం ట్రెంట్ లిమిటెడ్ షేర్లు మార్కెట్ ప్రారంభంలోనే 8 శాతానికి పైగా కుప్పకూలడంతో దమానీ సంపద నిమిషాల వ్యవధిలోనే ఆవిరైపోయింది.
ట్రెంట్ కంపెనీలో దమానీ తన ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ 'డెరైవ్ ట్రేడింగ్ అండ్ రిసార్ట్స్' ద్వారా 43లక్షల 98వేల 204 షేర్లను కలిగి ఉన్నారు. ఇది కంపెనీ మెుత్తం షేర్లలో 1.24 శాతానికి సమానం. సోమవారం రూ.4వేల429.80 వద్ద ముగిసిన షేరు ధర.. మంగళవారం ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో ఒక్కసారిగా 8.35 శాతం పడిపోయి రూ.4వేల 060కి చేరింది. దీనివల్ల దమానీ పెట్టుబడి విలువ రూ.వెయ్యి 948.32 కోట్ల నుండి రూ. వెయ్యి785.67 కోట్లకు పడిపోయింది. దీంతో ఆయన సంపద ఒక్కసారిగా రూ.162.65 కోట్ల మేర నష్టపోయారు.
టాటా స్టాక్ పతనానికి కారణమేంటి?
డిసెంబర్ 2025తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి కంపెనీ విడుదల చేసిన అప్‌డేట్ ఇన్వెస్టర్లను నిరాశపరిచింది. కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 17 శాతం పెరిగి రూ.5వేల220 కోట్లకు చేరినప్పటికీ.. గతంతో పోలిస్తే వృద్ధి మందగించడం అమ్మకాల ఒత్తిడికి కారణమైంది. జూడియో , వెస్ట్‌సైడ్ బ్రాండ్ల విస్తరణ వేగంగా జరుగుతున్నప్పటికీ.. స్టోర్ల సామర్థ్యం, లాభదాయకతపై విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బ్రోకరేజ్ విశ్లేషణ:
*మోర్గాన్ స్టాన్లీ: ఈ సంస్థ ట్రెంట్ షేరుపై 'ఓవర్‌వెయిట్' రేటింగ్‌ను కొనసాగిస్తూ, రూ. 5వేల456 టార్గెట్ ధరను నిర్ణయించింది.
* హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్: షేరు ధర ఇప్పటికే 50 శాతం మేర కరెక్షన్ కు గురైనందున.. ప్రస్తుత ధర వద్ద పెట్టుబడి పెట్టడం లాభదాయకమని పేర్కొంది.
* మోతీలాల్ ఓస్వాల్: ఆదాయ అంచనాలు తగ్గడం వల్ల స్వల్పకాలంలో షేరు ధరపై ఒత్తిడి కొనసాగవచ్చని హెచ్చరించింది.
మొత్తానికి ట్రెంట్ నెట్‌వర్క్ 854 జూడియో స్టోర్లకు చేరి అంతర్జాతీయంగా విస్తరిస్తున్నా.. మార్కెట్ అంచనాలను అందుకోవడంలో విఫలమవ్వడం దమానీ వంటి పెద్ద ఇన్వెస్టర్లకు భారీ నష్టాన్ని మిగిల్చింది.
