బెంగళూరులో అద్దె గొడవ: పెయింటింగ్ వేయించినందుకు 51వేలు కట్ చేసిన ఓనర్!

బెంగళూరులో అద్దె గొడవ: పెయింటింగ్ వేయించినందుకు 51వేలు కట్ చేసిన ఓనర్!

బెంగళూరులో  అద్దెకు ఉంటున్న ఓ వ్యక్తికి  సెక్యూరిటీ డిపాజిట్ విషయంలో ఇంటి ఓనరుతో జరిగిన గొడవ  సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పెద్ద చర్చ మొదలైంది. ఇల్లు ఖాళీ చేసే సమయంలో ఓనర్ దారుణంగా  డబ్బులు వసూల్ చేసాడని ఆవేదన వ్యక్తం చేశాడు.

వివరాల్లోకి వెళితే... బెంగళూరులో  అద్దెకు ఉంటున్న ఓ  వ్యక్తి   ఇల్లు ఖాళీ చేసేటప్పుడు, పెయింటింగ్ అండ్ క్లీనింగ్ పేరుతో ఓనర్ ఏకంగా రూ. 51 వేలు సెక్యూరిటీ డిపాజిట్ నుండి కట్ చేసాడు. అంతేకాకుండా ఇల్లు అప్పగించే ముందు గోడలతో పాటు డోర్లకు  కూడా పెయింట్ వేయించమని  ఓనర్ పట్టుబట్టాడు.

 మొదట ఒక పెయింటర్ వచ్చి చూసినప్పుడు, రిపెయింటింగ్  ఖర్చు రూ. 20 వేలలోపే ఉంటుందని చెప్పాడు. అద్దెకు ఉంటున్న  వ్యక్తి  ఖాళీ చేసి వెళ్ళిపోయాక, ఆ పెయింటర్ ఓనర్‌తో కుమ్మకై  ఖర్చుని  రూ. 36,000కు పెంచేశాడు. ఈ విషయం అద్దెకు ఉంటున్న  వ్యక్తికి చెప్పకుండానే పని పూర్తి చేసి బిల్లు పంపారు.

అలాగే 3BHK ఫ్లాట్ క్లీనింగ్ కోసం మరో రూ. 10వేలు ఎక్స్ట్రా  కట్ చేశారు. మామూలుగా బయట రూ. 5వేలు అయ్యే పనికి ఇంత తీసుకోవడంపై అద్దెకు ఉన్న వ్యక్తి మండిపడుతున్నాడు.

ఇంకా డబ్బులు ఆపేసిన ఓనర్
ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఆ ఇంటి యజమాని, మరో రూ. 5,000 కూడా కట్ చేసాడు. కొత్తగా వచ్చే కిరాయి వాళ్లు ఇంట్లోకి చేరిన రెండు వారాల వరకు, ఎలాంటి రిపేర్లు లేవని కన్ఫర్మ్ చేశాకే ఆ డబ్బులు ఇస్తానని చెప్పడం గమనార్హం. తమకు చెప్పకుండా ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు లాగేసుకోవడం అన్యాయమని అద్దెకు ఉన్న వ్యక్తి వాపోతున్నాడు.

సోషల్ మీడియాలో  
ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది సాధారణంగా ఒక నెల అద్దె ఇంటి రిపేర్ల కోసం తీసుకోవడం కామనే కదా అని ఓనర్‌కు సపోర్ట్  చేస్తున్నారు. మరికొందరు మాత్రం పెద్ద నగరాల్లో ఓనర్ల ఆగడాలు ఎక్కువయ్యాయి, అందుకే అందరూ సొంత ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నారు అని విమర్శిస్తున్నారు.