హోలీ పండక్కి నీళ్లు వేస్టే చేయొద్దు : బెంగళూరు వార్నింగ్

హోలీ పండక్కి నీళ్లు వేస్టే చేయొద్దు : బెంగళూరు వార్నింగ్

కర్ణాట‌క రాజ‌ధాని బెంగళూరును ప్రస్తుతం తీవ్ర నీటి ఎద్దడి స‌మ‌స్య వేధిస్తోంది. రోజువారీ అవ‌స‌రాల‌కు కూడా జ‌నం నీరులేక‌ ఇబ్బంది ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో హోలీ వేడుక‌ల‌పై బెంగ‌ళూరు న‌గ‌ర నీటి బోర్డు తాజాగా నివాసితుల‌కు కీల‌క సూచ‌నలు చేసింది. హోలీ సెల‌బ్రేష‌న్స్‌లో భాగంగా నిర్వహించే పూల్ పార్టీలు, రెయిన్ డ్యాన్స్‌లకు కావేరి, బోర్‌వెల్ నీటిని ఎట్టిప‌రిస్థితుల్లో వినియోగించవద్దని కోరింది. 

ఓ వైపు బెంగళూరులో నీటి కొరత పెరుగుతుంటే మరోవైపు హోళీ వేడుకల కోసం భారీ ఏర్పాట్లు చేస్తుండడం వివాదాస్పదమవుతోంది. కొన్ని హోటళ్లు స్పెషల్ హోళీ ప్యాకేజ్‌లు ఇస్తున్నాయి. పూల్‌ పార్టీలు, రెయిన్ డ్యాన్స్‌లకు ప్లాన్ చేస్తున్నాయి. అసలే నీళ్లు లేక అల్లాడుతుంటే ఇవేం పార్టీలు అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే Bangalore Water Supply and Sewerage Board (BWSSB) ఈ సమస్యని పరిష్కరించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. నీళ్లను ఇష్టమొచ్చినట్టు వినియోగించడంపై ఆంక్షలు విధించింది. కార్‌ క్లీనింగ్‌ కోసం అని, గార్డెనింగ్‌ అని నీళ్లు వృథా చేయకూడదని వార్నింగ్ ఇచ్చింది. బెంగళూరు నగరంలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా చిన్నస్వామి స్టేడియంకు ప్రతిరోజూ 75వేల  లీటర్లకు పైగా శుద్ధి చేయబడిన నీరు అందుతుందని బోర్డు పేర్కొంది.

 హోలీ అనేది హిందూ సంస్కృతిని చాటిచెప్పే పండుగ. ఇంట్లో జరుపుకోవడం, ఆచార వ్యవహారాలను పాటించడంలో ఎలాంటి సమస్య లేదు. అయితే, వాణిజ్య ప్రయోజనాల కోసం రెయిన్ డ్యాన్స్‌లు, పూల్ పార్టీలు వంటి వినోదాలను ఈ సమయంలో నిర్వహించడం మంచిది కాదు. కావేరి నీరు మరియు బోర్‌వెల్ నీటిని ఉపయోగించడం నిషేధించబడింది. సిలికాన్ వ్యాలీ'గా పేరొందిన బెంగ‌ళూరు ప్రస్తుతం ప్రతిరోజు 500 మిలియన్ లీటర్ల నీటి కొరతతో తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత కొన్ని వారాలుగా నివాసితులు నీటి ఎద్దడి కార‌ణంగా ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారు. . తగినంత వర్షాలు కురవకపోవడం, భూగర్భ జలాలు పడిపోవడంతో నగరవ్యాప్తంగా పలు బోర్లు ఎండిపోయిన నేప‌థ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది. 

బెంగళూరు ప్రజలు రెండు రోజులకోసారి స్నానాలు చేస్తున్నారు. ఇంట్లో వంట చేస్తే అంట్లు తోముకోడానికి నీళ్లు లేవని డిస్పోజబుల్ ప్లేట్‌లు, కప్‌లు వాడుతున్నారు. కొందరైతే షాపింగ్ మాల్స్‌లోని టాయిలెట్స్‌లో స్నానాలు చేస్తున్నారు. ఇక ఐటీ ఉద్యోగులూ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తమకు వర్క్‌ ఫ్రమ్ హోమ్‌ ఇచ్చేస్తే సొంతూళ్లకి వెళ్లిపోయి పని చేసుకుంటామని అంటున్నారు.

 వర్షాకాలం వచ్చేంత వరకూ తమకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వాలని కంపెనీలకు రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు. కానీ దీనిపై ఇంకా ఎవరూ నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి రోజువారీ అవసరాలు తీరడమే గగనమైపోయింది. వేలకు వేలు పోసి వాటర్ ట్యాంకర్లలో నీళ్లు తెప్పించుకుంటున్నారు. ప్రభుత్వం ఈ ట్యాంకర్‌ల ధరలపై ఆంక్షలు విధించింది. ఎక్కువగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వర్షాకాలం వరకూ ఈ కష్టాలు తప్పేలా కనిపించడం లేదని బెంగళూరు వాసులు వాపోతున్నారు.