- భారతీయ సంస్కృతికి ప్రతీక: జర్మన్ రాయబారి ఫిలిప్ అకెర్మాన్
న్యూఢిల్లీ/బెర్లిన్: జర్మనీ రాజధాని బెర్లిన్‌లో నూతనంగా నిర్మించిన గణేశ్ ఆలయం యూరప్‌లోనే అత్యంత ఎత్తైన హిందూ టెంపుల్‌గా గుర్తింపు పొందింది. బెర్లిన్‌లోని న్యూకోల్న్ ప్రాంతంలోని హాసెన్‌హైడే పార్కు సమీపంలో నిర్మించిన ఈ ఆలయ గోపురం ఎత్తు 17 మీటర్లు. 2005 సెప్టెంబర్ 24న ప్రారంభమైన నిర్మాణ పనులు పూర్తికావడానికి 21 సంవత్సరాలు పట్టింది.
భక్తుల విరాళాలు, సేవా కార్యక్రమాల ద్వారా సమీకరించిన నిధులతో దీన్ని నిర్మించారు. ఇందులోని విగ్రహాలను భారతీయ కళాకారులు 5 వేల సంవత్సరాల పురాతన ఆగమ సంప్రదాయాలకు అనుగుణంగా రూపొందించారు. వాటికోసం తమిళనాడు నుంచి తీసుకెళ్లిన నల్ల గ్రానైట్‌ను వాడారు. ఇటీవల ఆలయ కుంభాభిషేకం, ప్రారంభోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
బెర్లిన్‌లో ఉండటం గర్వకారణం
దక్షిణ భారత–తమిళ శైలిలో నిర్మించిన ఈ ఆలయం ఎంతో అద్భుతంగా ఉందని భారత్‌లోని జర్మనీ రాయబారి ఫిలిప్ అకెర్మన్ ప్రశంసించారు. ఇటీవల ఈ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐరోపాలోనే అత్యంత ఎత్తైన ఆలయం బెర్లిన్‌లో ఉండడం ఎంతో గర్వకారణమన్నారు.
