కోడి పందాల జోరు : లక్షల్లో బెట్టింగులు

కోడి పందాల జోరు : లక్షల్లో బెట్టింగులు

ఆంధ్రాలో లక్షల్లో బెట్టింగ్‌‌‌‌‌‌‌‌లు,
గిఫ్ట్‌‌‌‌‌‌‌‌లుగా రాయల్ ఎన్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ బైక్‌ లు

అమరావతి, వెలుగు: సంక్రాంతి పండుగ సందర్భంగా సంప్రదాయ కోడి పందాల నిర్వహణ ఆంధ్రాలో కాక రేపుతోంది. కోడి పందాల నిర్వహణ చట్ట ప్రకారం నేరమని.. నిర్వహిస్తే క్రిమినల్ కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించినా ప్రజలు పట్టించుకోవడం లేదు. అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించి తీరుతామని చెబుతున్నారు. దీనికి అధికార, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అనధికారికంగా మద్దతిస్తున్నారు.

భారీగా ఏర్పాట్లు

తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో కోడి పందాల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేశారు. లక్షలు ఖర్చు చేసి పందెం బరులను తీర్చిదిద్దారు. కృష్ణా జిల్లా బందరు, గన్నవరం సహా కొన్ని ప్రాంతాల్లో భోగి నాడే కోడిపందాలు మొదలవగా, మిగతా ప్రాంతాల్లో బుధవారం షురూ కానున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు కోడిపందాలను ప్రారంభించి తన కోడిని బరిలోకి దించారు. వైసీపీ, టీడీపీ పక్షాలుగా విడిపోయి లక్షల్లో బెట్టింగ్ లు కాశారు. మొత్తం 30 రౌండ్లుగా సాగే పోరులో 16 రౌండ్లు గెలిచిన వారిదే విజయం. బరి నిర్వా హకులు విజేతకు రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను గిఫ్టుగా ఇస్తామని ప్రకటించారు. కోడి పందెం శిబిరాల్లో సర్వ సౌకర్యాలు కల్పించారు. రాత్రంతా పందేలు నిర్వహించేందుకు భారీ ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. పందెం కాసేందుకు వచ్చినవారి కోసం ఫుడ్ స్టాల్స్, బిర్యానీ పాయింట్లు కూడా పెట్టారు.

కోళ్లకు కత్తులు కట్టి బరిలోకి…

కృష్ణా జిల్లా బందరు, పామర్రు, గన్నవరం, నూజివీడు, చాట్రాయిలో కోళ్లకు కత్తులు కట్టి బరిలోకి దించారు. పందెంలో పాల్గొనే కోళ్లపై లక్షల్లో బెట్టింగులు కాశారు. గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ ఇన్ చార్జ్ యార్లగడ్డ వెంకట్రావ్ ఆధ్వర్యంలో వేర్వేరు బరులను ఏర్పాటు చేశారు. ఒక్కో కోడిపై రూ.20 లక్షల వరకు బెట్టింగ్ కాశారు. పశ్చి మగోదావరి జిల్లా ఏలూరులో కోడి పందాల నిర్వహణ రసాభాసగా మారింది. అనుమతి లేదంటూ నిర్వాహకులు ఏర్పాటు చేసిన బరులు, టెంట్లను ఎమ్మార్వో, పోలీసులు తొలగించారు. దీంతో పోలీసులు, నిర్వాహకులకు మధ్య వాగ్వాదం జరిగింది. భీమవరం, పాలకొల్లు శిబిరాలకు వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఆరు ఎకరాల్లో కార్లు, బైకుల పార్కింగ్ కు నిర్వాహుకులు ఏర్పాట్లు చేశారు. మొదటి రోజే రూ. 40 లక్షలు చేతులు మారాయి. వైసీపీ నేతలు నిర్వహించిన బరిలో ఓ వ్యక్తి కారును పందెం కాసి ఓడిపోయాడు. చాట్రాయి వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో మరో వ్యక్తి రూ. 37 లక్షల పందెం కాశాడు. గన్నవరం, బందరు శిబిరాల్లో వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ, కర్నాటక,తమిళనాడు, ఒడిశా నుంచి పందెం రాయుళ్లు వచ్చినట్లు నిర్వాహకులు చెప్పారు.