భారతదేశ ఇన్సూరెన్స్ రంగం ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు మెడికల్ ఖర్చులు పెరగడం, జీఎస్టీ తగ్గింపు వంటి కారణాలతో పాలసీల సంఖ్య పెరుగుతుంటే.. మరోవైపు అవగాహన లోపం వల్ల సామాన్యులు 'మిస్ సెల్లింగ్' బారిన పడి పాలసీలు కొంటున్నారు. పాలసీ కొనుగోలు సమయంలో తప్పుడు సమాచారం చెప్పి అంటకడుతున్న ఏజెంట్లు, ఇన్సూరెన్స్ సిబ్బంది వల్ల చివరికి డబ్బు కట్టినా ప్రయోజనాలు అందని పరిస్థితి ఎదురవుతోంది చాలా మందికి. ఇన్సూరెన్స్ పాలసీ కొనే సామాన్య ప్రజలు గమనించాల్సిన కీలక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
IRDAI 2024-25 రిపోర్ట్ పరిశీలిస్తే.. ఏడాది కాలంలో దాదాపు 11.26 కోట్ల జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు నమోదయ్యాయి. అయితే అదే సమయంలో 'బీమా భరోసా' పోర్టల్‌లో 2.5 లక్షలకు పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 22% ఫిర్యాదులు కేవలం ఇన్సూరెన్స్ సంస్థల 'అన్యాయమైన వ్యాపార పద్ధతుల' గురించే ఉండటం ఆందోళనకరం. అంటే పాలసీని అమ్మేటప్పుడు చెప్పిన విషయాలు ఒకటైతే.. క్లెయిమ్ సమయంలో జరిగేవి మరొకటి అని స్పష్టమవుతోంది.
తక్కువ ఖర్చుతో పాలసీల వెనుక నిజాలు..
చాలామంది ఇన్సూరెన్స్ అంటే తక్కువ ప్రీమియం ఉన్న ప్లాన్ కోసం వెతుకుతుంటారు. కానీ అది ఎప్పుడూ సరైన పద్ధతి కాదు. తక్కువ ధరలో వచ్చే పాలసీల్లో తరచుగా ఎక్స్‌క్లూజన్స్, వెయిటింగ్ పీరియడ్, సబ్-లిమిట్స్ లాంటి చాలా రూల్స్ ఉంటాయి. అవగాహన లేకుండా ఇలాంటి పాలసీలు తీసుకుంటే, క్లెయిమ్ సమయంలో లక్షల రూపాయలు సొంత జేబు నుంచే చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే కవరేజ్ ఉన్నా క్లెయిమ్ సొమ్ముకు పైన చెప్పిన రూల్స్ కోతలు విధిస్తాయి కాబట్టి.
రక్షాకవచంగా AI..
ప్రస్తుతం ఇన్సూరెన్స్ రంగంలో AI కీలక పాత్ర పోషిస్తోంది. పాలసీని కొనే ముందే వివిధ ప్లాన్ల మధ్య తేడాలను పోల్చి చూడటానికి, మీ అవసరాలకు తగ్గట్టుగా ఏది సరైనదో గుర్తించడానికి AI టూల్స్ సహాయపడుతున్నాయి. ఇది సేల్స్ ఏజెంట్ల ఒత్తిడిని తగ్గించి.. పారదర్శకమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తోంది.
అవగాహనే అసలైన ఆయుధం..
ఇన్సూరెన్స్ అనేది అందరికీ ఒకేలా ఉండే ఉత్పత్తి కాదు. మీ కుటుంబ అవసరాలు, ఆరోగ్యం, ఆర్థిక స్థితిగతులను బట్టి దాన్ని కస్టమైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే పాలసీ డాక్యుమెంట్‌లోని 'ఎక్స్‌క్లూజన్స్', 'కో-పేమెంట్' రూల్స్ చదవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మీరు ఏజెంట్‌ను సరైన ప్రశ్నలు అడగగలరు పాలసీ కొనుగోలు చేసేటప్పుడు. ఇలా చేయటం వల్ల మాయమాటల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోగలరు. చివరికి క్లెయిమ్ రిజెక్ట్ అయ్యాక ఉసూరుమంటం కంటే ముందే అన్నీ చదివి ఒకటికిరెండు సార్లు అనుమానాలు నివృత్తి చేసుకోవటం మాత్రమే మోసాల నుంచి తప్పుల నుంచి మిమ్మల్ని కాపాడుకోగలరని గుర్తుంచుకోండి.
