వరద ముప్పు అంచనా సర్వే షురూ!..హైదరాబాద్ ఐఐటీతో సర్కారు అగ్రిమెంట్ 

వరద ముప్పు అంచనా సర్వే షురూ!..హైదరాబాద్ ఐఐటీతో సర్కారు అగ్రిమెంట్ 
  • ఆరు నెలల్లో రిపోర్టు ఇవ్వాలని ఆదేశం
  • ఇటీవల భద్రాచలంలో ఐఐటీ నిపుణుల బృందం పర్యటన 

భద్రాచలం, వెలుగు : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల బ్యాక్​ వాటర్​తో పాటు, గోదావరి వరదల సమయంలో వరద ముప్పు అంచనావేసేందుకు  తెలంగాణ సర్కారు సర్వే చేపడుతోంది.  గోదావరి వరద సరళిపై ఉమ్మడి సర్వేకు ఆంధ్రప్రదేశ్​ సర్కారు సహకరించడం లేదు. ఈ నేపథ్యంలో ముంపు ముప్పు తీవ్రత గురించి తెలుసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగింది. ఈ మేరకు హైదరాబాద్​ ఐఐటీ నిపుణుల టీంతో ప్రభుత్వం గత నెల 25న అగ్రిమెంట్​ చేసుకుంది. అగ్రిమెంట్​ చేసుకున్న నాటి నుంచి ఆరు నెలల లోపు సర్వే పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని టీమ్​ను ఆదేశించింది. ఇందుకు అవసరమైన నిధులు రూ.19.40లక్షలను ఇప్పటికే ప్రభుత్వం రిలీజ్​ చేసింది.  అగ్రిమెంట్​ అనంతరం ఇటీవల ఐఐటీ నిపుణుల బృందం భద్రాచలంలో పర్యటించింది. 

కాటన్​ ఆనకట్ట టు భద్రాచలం మధ్య పరిశీలన

దుమ్ముగూడెం-అశ్వాపురం మండలాల మధ్య గోదావరిపై నిర్మించిన సర్​అర్ధర్​ కాటన్​ ఆనకట్టకు దిగువన భద్రాచలం -పినపాక నియోజకవర్గాల పరిధిలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఐఐటీ టీమ్​ ఇటీవల పర్యటించింది. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలోని తూరుబాక, కిన్నెరసాని, దోమలవాగు, పెదవాగు, ఎదుళ్ల వాగు ప్రవాహాలతో 900 ఎకరాల్లో పంట ముంపునకు గురవుతోంది. దీనికి పోలవరం బ్యాక్​ వాటర్ తోడైతే ముంపు తీవ్రత మరింత పెరుగుతుంది.

దీనికి తోడు సారపాకలోని ఐటీసీ పేపరుబోర్డు, అశ్వాపురంలోని హెవీవాటర్ ప్లాంటు, భద్రాచలం రామాలయం, సింగరేణి సంస్థలకు కూడా నష్టం ఉంటుందని చాలా కాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణ భూభాగంలో జరిగే నష్టం అంచనాపై ఉమ్మడి సర్వేకు ఏపీ ముందుకు రావడం లేదు. సరైన శాస్త్రీయ నివేదికలు లేకపోవడంతో ఈ ప్రాంతంలో చేపట్టే అభివృద్ధి పనులపై నీలినీడలు అలుముకుంటున్నాయి. భద్రాచలం రామాలయంలో మాస్టర్​ ప్లాన్​ అమలుకు కూడా ప్రతిబంధకంగా మారింది. ముంపు తీవ్రతను బట్టి కరకట్టల నిర్మాణాల అవసరం, వాటి ఎత్తు పెంచడం, ఉన్న కరకట్టలు బలోపేతం చేయడం, ముంపు సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రణాళికలు తయారీపై ప్రభుత్వం దృష్టిసారించనుంది. 

ప్రాథమిక వివరాలు సేకరించారు

భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో పోలవరం బ్యాక్​ వాటర్, వరద ముంపు ముప్పు అంచనాకు హైదరాబాద్​ ఐఐటీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆరు నెలల్లో వారు పూర్తిగా సర్వే చేసి నివేదిక ఇస్తారు. ఇందులో భాగంగా ఇటీవల ఐఐటీ నిపుణుల బృందం భద్రాచలం వచ్చింది. దుమ్ముగూడెం, అశ్వాపురం, భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో పర్యటించింది. ప్రాథమిక వివరాలు సేకరించారు. వాటి ఆధారంగా వారు పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి నివేదిక ఇస్తారు. డిసెంబర్​ నాటికి సర్వే నివేదికను అందజేసే అవకాశం ఉంది. - జానీ, ఈఈ, ఇరిగేషన్​ భద్రాచలం