గిరిజనులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వద్దు : ఐటీడీఏ పీవో రాహుల్

గిరిజనులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వద్దు : ఐటీడీఏ పీవో రాహుల్
  • ఐటీడీఏ పీవో రాహుల్ 

అశ్వారావుపేట, వెలుగు: మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించవద్దని  భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ డాక్టర్లకు సూచించారు. మంగళవారం మండలంలోని రెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాల్లో వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేని నిరుపేదలైన గిరిజన కుటుంబాల సౌకర్యార్థం ఈ మెగా క్యాంపును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ క్యాంపులను గిరిజనులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

చుట్టుపక్కల గ్రామాలకు చెందిన గిరిజనులకు పలు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. అనంతరం అంగన్​వాడీ సెంటర్ ను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీవో అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ఆకస్మికంగా పాఠశాల తనిఖీ 

మండలంలోని పాకల గూడెం, బండారి గుంపు జీపీఎస్ పాఠశాలను పీవో రాహుల్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల చేత బోర్డుపై అక్షరాలు, అధికారుల పేర్లు ఎలా రాయాలో వివరించారు. విద్యార్థులు సరిగ్గా రాయటం, చదవడంలో వెనుకబడి ఉన్నారని టీచర్లపై ఫైర్​ అయ్యారు. ఉద్దీపకం వర్క్ బుక్ లోని సులభమైన పదాలు పిల్లలు చెప్పలేకపోతున్నారని అసహనం వ్యక్తి చేశారు. సంబంధిత ఎస్సీఆర్ పీవోల పర్యవేక్షణ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్లు కృష్ణ, రమేశ్, వెంకటేశ్వర్లు, ఐటీడీఏ ఏఈ  ప్రసాద్  పాల్గొన్నారు.