చౌటుప్పల్/భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. గురువారం ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో సమావేశం ముగించుకుని హైదరాబాద్‌కు వెళ్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఈ ప్రమాదం జరిగింది. టోల్‌బూత్‌ల వద్ద ఎమ్మెల్యే కాన్వాయ్ వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా ఓ లారీ దూసుకొచ్చి ఎమ్మెల్యే కారును ఎడమ వైపున ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన సురక్షితంగా బయటపడటంతో పార్టీ నాయకులు, కాన్వాయ్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
