- ఇకపై ప్రతి పది రోజులకు ఒకసారి రివ్యూ : మంత్రి పొంగులేటి
భద్రాచలం/మణుగూరు, వెలుగు : గోదావరి పుష్కరాలు ప్రారంభమవడానికి 15 రోజుల ముందే భద్రాచలం అభివృద్ధి పనులు పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. జరుగుతున్న పనులు, పురోగతి, ఇబ్బందులపై ప్రతి పది రోజులకు ఒకసారి రివ్యూ చేయాలని సూచించారు. భద్రాద్రి కలెక్టర్అంకిత్తో కలిసి ఆదివారం శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల పర్యవేక్షణకు ఎండోమెంట్ తరఫున అధికారిని నియమించాలని ఆదేశించారు.
ఆలయ గోపురాలు, పురాతన నిర్మాణాల నాణ్యతను నిపుణులతో పరిశీలించి, ప్రాచీన వైభవానికి ఎలాంటి భంగం కలగకుండా పనులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సబ్‌కలెక్టర్ ఆఫీస్ లో రివ్యూ నిర్వహించారు. డ్రాయింగ్, డిజైన్, సాంకేతిక అనుమతుల్లో ఆలస్యం లేకుండా అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎస్పీ రోహిత్‌రాజ్, ఐటీడీఏ పీవో బి.రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్శ్రేష్ఠ, ఈవో దామోదర్‌రావు, భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, ఆర్కిటెక్ సూర్యనారాయణమూర్తి ఉన్నారు. అనంతరం అశ్వాపురం, మణుగూరు మండలాల్లో పర్యటించి బీటీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు.
పార్లమెంట్, అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయ్
భద్రాద్రికొత్తగూడెం/పాల్వంచ, వెలుగు : పార్లమెంట్, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు రాబోతున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని మంత్రి క్యాంప్‌ఆఫీస్‌లో ఆదివారం బీఎల్ఏలు, ముఖ్య నేతలతో నిర్వహించిన మీటింగ్ లో మాట్లాడారు. కొత్తగూడెం నియోజకవర్గంలో దాదాపు 70 వేల ఓట్లు మాయం అయ్యాయన్నారు. ఇప్పటి వరకు 69 శాతమే ఓటరు నమోదు జరిగిందన్నారు. అనంతరం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
అటవీ, రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలి
బూర్గంపహాడ్, వెలుగు : అటవీ, -రెవెన్యూ సమస్యల పరిష్కారం, భూముల రీ-సర్వే పనుల్లో ఆలస్యం చేస్తే ఉపేక్షించేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ లో నిర్వహించిన మీటింగ్ లో జిల్లాలోని 70 గ్రామాల్లో చేపడుతున్న భూముల రీ-సర్వే పనుల పురోగతిని సమీక్షించారు. అటవీ శాఖ అధికారి సిద్దార్థ విక్రమ్ సింగ్, ఎస్పీ రోహిత్ రాజు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, అడిషనల్ కలెక్టర్లు వేణుగోపాల్, విద్యా చందన, జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి, కొత్తగూడెం ఆర్డీవో మధు పాల్గొన్నారు.
