జగన్నాథపురానికి జాతీయ అవార్డు

జగన్నాథపురానికి జాతీయ అవార్డు

న్యూఢిల్లీ, వెలుగు: నీటి నిర్వహణ, సంరక్షణ చర్యలకు గాను దేశంలోనే ఉత్తమ పంచాయతీగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జగన్నాథపురం గ్రామం జాతీయ అవార్డు దక్కించుకుంది. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఫోర్త్ నేషనల్ వాటర్ అవార్డ్స్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ చేతుల మీదుగా జగన్నాథపురం సర్పంచ్ గడ్డం భవానీ, పంచాయతీ సెక్రటరీ షేక్ ఇబ్రహీం అవార్డు అందుకున్నారు.

బెస్ట్ స్టేట్, బెస్ట్ డిస్ట్రిక్, బెస్ట్ విలేజ్, బెస్ట్ అర్బన్ లోకల్ బాడీ, బెస్ట్ మీడియా, బెస్ట్ ఎన్జీవో.. ఇలా మొత్తం 12 విభాగాల్లో ర్యాంకులు ప్రకటించి అవార్డులు అందించారు. ఇందులో ఉత్తమ జిల్లాగా మూడో స్థానంలో ఆదిలాబాద్ కు చోటు దక్కింది. ఉత్తమ విద్యాసంస్థగా హైదరాబాద్ లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ(మాను) సెకండ్ ప్లేస్ లో నిలిచింది. వీరికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ అవార్డులు అందజేశారు. బెస్ట్ స్టేట్ గా మధ్యప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఒడిశా రెండో స్థానంలో నిలవగా, ఏపీ– బిహార్  మూడో ర్యాంక్ ను పంచుకున్నాయి. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ధన్కడ్ ప్రసంగిస్తూ.. జల సంరక్షణను రోజువారీ జీవితంలో అంతర్భాగంగా అలవరుచుకోవాలని పిలుపునిచ్చారు. నీటిని కాపాడుకోవడం ద్వారానే భవిష్యత్తును కాపాడుకోగలుగుతామని, అప్పుడే అందరం కలిసికట్టుగా జీవించగలమన్నారు.