భక్తుల ఇంటికే భద్రాద్రి సీతా రాముల కల్యాణ తలంబ్రాలు : టీజీఎస్ ఆర్టీసీ

భక్తుల ఇంటికే భద్రాద్రి సీతా రాముల కల్యాణ తలంబ్రాలు : టీజీఎస్ ఆర్టీసీ
  •     రూ.151 చెల్లించి తలంబ్రాలు పొందే అవకాశం
  •     రేపటి నుంచి బుకింగ్స్ ప్రారంభం

హైదరాబాద్ సిటీ, వెలుగు: శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు ఇంటి వద్దకే అందజేయాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల 27న భద్రాచలంలో జరిగే రాములోరి కల్యాణ వేడుకకు వెళ్లలేని రెండు తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం తలంబ్రాలు అందజేసే విషయంలో ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 

ఈ మేరకు శనివారం బస్ భవన్‌‌లో భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్‌‌‌‌ను ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి ఆవిష్కరించారు. నిరుడులాగే ఈసారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములవారి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇండ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టినట్టు ఆయన తెలిపారు. 

తలంబ్రాల ప్యాకెట్లు పొందాలనుకునే భక్తులు www.tgsrtclogistics.co.in ద్వారా బుకింగ్ చేసుకోవచ్చన్నారు. అలాగే, టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి, వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. రాములోరి కల్యాణం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు హోం డెలివరీ చేస్తామని చెప్పారు. మరిన్ని వివరాలకు ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు 040 -23450033, 040 -69440069లలో సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ ఆర్టీసీ సీటీఎం(మార్కెటింగ్ అండ్ కమర్షియల్) శ్రీధర్, లాజిస్టిక్ ఏటిఏం రాజన్, భాను తదితరులు పాల్గొన్నారు.