రాష్ట్రంలోకి ప్రవేశించిన భారత్​ జోడో యాత్ర

రాష్ట్రంలోకి ప్రవేశించిన భారత్​ జోడో యాత్ర
  • సంపన్నులు ఓ వైపు.. సామాన్యులు ఓ వైపుగా భారత్​ విడిపోయింది
  • ఆర్​ఎస్​ఎస్​, బీజేపీ విద్వేషాలను రెచ్చగొడుతున్నయ్​: రాహుల్
  • మక్తల్​లోని కృష్ణా బ్రిడ్జి వద్ద ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్​ శ్రేణులు 
  • కార్యకర్తలు భారీగా దూసుకురావడంతో తోపులాట.. ఉత్తమ్​, పొన్నాలకు గాయాలు
  • యాత్ర కొనసాగింపునకు చిహ్నంగా కాగడాను రేవంత్​కు అందించిన కర్నాటక పీసీసీ చీఫ్​
  • తొలిరోజు వాసునగర్​ వరకు 5.2 కి.మీ. నడిచిన రాహుల్​
  • దీపావళి సందర్భంగా యాత్రకు మూడు రోజులు బ్రేక్

మహబూబ్‌‌నగర్/ నారాయణపేట/మాగనూరు/ మక్తల్, వెలుగు: దేశం రెండు వర్గాలుగా విడిపోయిందని, సంపన్నులు ఓ వైపు ఉంటే.. సామాన్యులు, రైతులు, నిరుద్యోగులు, చిరు వ్యాపారులు మరో వైపు ఉన్నారని కాంగ్రెస్​ ముఖ్య నేత రాహుల్​గాంధీ అన్నారు. అందరినీ ఒకే వర్గంలోకి తీసుకువచ్చి ఐక్య భారత్ ​నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. సెక్యులర్ దేశంలో ఆర్​ఎస్​ఎస్​, బీజేపీ  మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు.  హింస పెరిగిపోతున్నదని.. రైతులు, యువకులు, సామాన్యులకు న్యాయం జరగడం లేదని అన్నారు. దేశ సమగ్రత, సమైక్యత పరిరక్షణ కోసం భారత్ జోడో యాత్రను చేపట్టామని, ఏ శక్తి కూడా యాత్రను అడ్డుకోలేదని ఆయన పేర్కొన్నారు. రాహుల్​ చేపట్టిన ‘భారత్​ జోడోయాత్ర’ ఆదివారం ఉదయం కర్నాటక రాష్ట్రం రాయచూర్​ మీదుగా ఉదయం 8.35 గంటలకు మన రాష్ట్రంలోకి ఎంటర్‌‌‌‌‌‌‌‌ అయింది. అంతకుముందు కర్నాటక వైపు దేవసూగూర్​ వద్ద ఉదయం 8 గంటలకు ఆయన ఓ హోటల్​లో బ్రేక్​ ఫాస్ట్​ చేశారు. అనంతరం నారాయణపేట జిల్లా మక్తల్​ నియోజకవర్గంలోని కృష్ణా మండలం వద్ద కృష్ణా బ్రిడ్జి మీదుగా రాష్ట్రంలోకి అడుగు పెట్టారు. కర్నాటక పీసీసీ చీఫ్​శివకుమార్​జాతీయ జెండా, కాగడాను యాత్ర కొనసాగింపునకు చిహ్నంగా తెలంగాణ పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డికి అందించారు. అక్కడి నుంచి యాత్ర తెలంగాణలోని వాసునగర్​ మీదుగా 5.2 కిలోమీటర్ల వరకు సాగి, టై రోడ్డు వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా రాహుల్​గాంధీ మాట్లాడుతూ.. ‘‘మతశక్తుల నుంచి దేశాన్ని రక్షించుకోవడానికి, నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి, ధరల నియంత్రణపై పోరాటానికి యాత్ర కొనసాగుతుంది. దేశ ప్రజలందరికీ సమాన న్యాయం, సమాన హక్కులు కల్పించడమే మా లక్ష్యం. దేశాన్ని ఏకం చేస్తం” అని అన్నారు. కన్యాకుమారి నుంచి ప్రారంభించిన భారత్​ జోడో యాత్ర తమిళనాడు, కేరళ, కర్నాటక మీదుగా తెలంగాణ వరకు చేరుకుందని, అన్నిచోట్ల ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని చెప్పారు. ఇంతటి ఉత్సాహాన్ని చూపించిన రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీపావళి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు భారత్​ జోడో యాత్రకు బ్రేక్‌‌‌‌  ఉంటుందని, తిరిగి 27వ తేదీ నుంచి రైతులు, నిరుద్యోగులు, శ్రామికులతో కలిసి పాదయాత్ర కొనసాగిస్తామని వివరించారు. అనంతరం టై రోడ్​ దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్​ నుంచి హెలికాప్టర్​ ద్వారా శంషాబాద్​ విమానాశ్రయానికి బయల్దేరి వెళ్లిన రాహుల్​.. అక్కడి నుంచి ప్రత్యేక ఫ్లైట్‌‌‌‌లో ఢిల్లీ వెళ్లారు.  

యాత్రకు ఘన స్వాగతం

రాహుల్​గాంధీ చేపట్టిన ‘భారత్​ జోడో యాత్ర’కు తెలంగాణ కాంగ్రెస్ నేతలు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. కర్నాటక రాష్ట్ర సరిహద్దు చివ ర్లో అక్కడి రాష్ట్ర కాంగ్రెస్​నాయకులు పటాకులు కాలుస్తూ సెండాఫ్​ ఇవ్వగా.. కృష్ణా నదిపై ఉన్న  బ్రిడ్జి మీదుగా మన రాష్ట్రంలోకి రాహుల్​ అడుగు పెట్టారు. అనంతరం ఇక్కడి లీడర్లు భారీగా పటాకులు కాలుస్తూ స్వాగతం పలికారు. 

వాహనాల రూట్​ డైవర్ట్​

మహబూబ్​నగర్​ మీదుగా రాయచూర్​ వెళ్లే వాహనాల రూట్​ను పోలీసులు డైవర్ట్​ చేశారు. భారత్​ జోడో యాత్ర వస్తున్న సందర్భంగా కృష్ణా బ్రిడ్జి మీద నుంచి రాకపోకలను నిలిపి వేశారు. మరికల్ నుంచే వాహనాలను అమరచింత మీదుగా జూరాల డ్యామ్​ నుంచి రాయచూర్​కు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.​ పాదయాత్రలో కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్కం ఠాకూర్, ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి, నాయకులు జైరాం రమేశ్​,  మధు యాష్కీగౌడ్​, చిన్నారెడ్డి,  భట్టి విక్రమార్క,  సీతక్క, వి.హనుమంతరావు, బోస్​రాజు, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, పొన్నం ప్రభాకర్​, వంశీచంద్​రెడ్డి, సంపత్​కుమార్​, మహేశ్వర్​రెడ్డి, ప్రశాంత్​రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

దూసుకెళ్లిన కార్యకర్తలు.. తోపులాట.. పలువురికి గాయాలు

కృష్ణ నదిపై ఉన్న బ్రిడ్జిని దాటి రాష్ట్రంలోకి వస్తున్న రాహుల్​ని కలవడానికి ఒక్కసారిగా దూసుకెళ్లారు. దీంతో తోపులాట జరిగింది. పలువురు ముఖ్యనేతలకు గాయాలయ్యాయి. ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి, నేతలు పొన్నాల లక్ష్యయ్య, మహేష్ కుమార్ గౌడ్ గాయపడ్డారు. పొన్నాల మోచేతికి గాయం కాగా మాజీ మంత్రి గీతారెడ్డి కట్టుకట్టారు. అనంతరం ఆయనను హాస్పిటల్​కు తరలించి చికిత్స అందించారు.